తవాంగ్ సందర్శన

గిరియానం – 23

అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దారి అంతటా బోర్డర్స్ రోడ్డు ఆర్గనైజేషన్ వారి హెచ్చరిక బోర్డులు రెండు మూడు ఫర్లాంగులకు ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత జాగ్రత్త ఎందుకంటే.. అది భారీ పర్వత ప్రాంతం. అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. డిరాంగ్ నుంచి తవాంగ్ నూటా ముప్పై కిలోమీటర్ల దూరం. ప్రకృతి సహకరిస్తే సుమారు నాలుగు గంటల ప్రయాణం. అదృష్టవశాత్తూ ఆరోజు వాతావరణం అనుకూలంగానే ఉంది. ప్రయాణం ఉత్సాహంగా సాగింది. పర్వత మేఘమాలికల రాసలీలలను తిలకిస్తూ ఆనందంతో తన్మయమైపోయిన నాకు అంతలోనే కారు ఆగినట్టు అనిపించింది. ఇహ లోకంలోకి వచ్చి చూద్దును కదా.. అది తవాంగ్ వార్ మెమోరియల్. అంతే! ఒక్కసారిగా మనస్సు గతచరిత్రలోకి పరుగులు పెట్టింది. పన్నెండువేల ఐదువందల అడుగుల ఎత్తులో గతచరిత్రకు సాక్ష్యంగా ఇది ఇక్కడ కొలువై ఉంది. దీనిని తవాంగ్ వెళ్ళే పర్యాటకులు చూసి తీరవలసిoదే.. సోకాల్డ్ దేశభక్తికి కాకుండా నిజమైన దేశభక్తికి ప్రత్యక్ష నిదర్శనం. 1962 యుద్ధవీరుడు, రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ త్యాగానికి గుర్తు. అదే సమయంలో ఒక ఆర్మీ అధికారి కుటుంబం అక్కడికి రావడం వల్ల నాకు మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం కలిగింది.. నేను ముందు వెళ్ళినప్పుడు అక్కడున్న ఆర్మీ జవాన్లు నన్ను లోపల ఉన్నజస్వంత్ సింగ్ సమాధికి దగ్గరగా వెళ్ళనివ్వలేదు. అందువల్ల నేను ఆర్మీ అధికారి కుటుంబంతో కలిసి లోపలికి వెళ్ళాను. అక్కడి జవాన్లు ఆయనకు సెల్యూట్ చేసి ఆ యోధుడి వీరగాథను ఇలా వివరించారు.

1962 నవంబర్ లో చైనా పి.ఎల్. ఏ ( పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ) నూరానాంగ్ పైన దాడి చేసింది. గడ్డ కట్టే చలిలో భారత సైనిక దళాలు శక్తిమేరకు పోరాటం చేసాయి. చైనా మిషిన్ గన్ స్థావరం మన సైనికులను చంపేస్తోంది. ఆ సమయంలో రైఫిల్ జస్వంత్ సింగ్ తన అనుచరులైన లాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ నేగి, రైఫిల్ మ్యాన్ గోపాల్ సింగ్ గుసైన్ ముగ్గురూ పాక్కుంటూ వెళ్ళి దాన్ని పేల్చేసారు. ఆ పోరాటంలో త్రిలోక్ సింగ్, గోపాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. జస్వంత్ సింగ్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా డెబ్బై రెండు గంటలపాటు అంటే మూడు రోజులు ధైర్య సాహసాలతో, గెరిల్లా పద్ధతిలో చైనా ఆర్మీతో తలపడి ముప్పుతిప్పలు పెట్టాడు.ఒకే చోటునుండి కాల్పులు జరపకుండా, చుట్టూ తిరుగుతూ వేరు వేరు చోట్ల నుండి చైనా సైనికుల మీద బుల్లెట్ల వర్షం కురిపించాడు. దారిలో బొమ్మలు పెట్టి తాను ఒంటరిని కాదని ఆర్మీ బలగాలతో ఉన్నట్టుగా చైనా ఆర్మీని నమ్మించాడు. ఆ సమయంలో స్థానిక ముంపాజాతికి చెందిన నూరా, సేలా అనే ఇద్దరు యువతులు అతనికి అన్నపానాదులు అందించి, యుద్ధంలో సహాయం చేసి, వాళ్ళు కూడా వీరమరణం పొందారు. డెబ్బైరెండు గంటలు ఆలస్యం కావడంవల్ల భారతసైన్యం మళ్ళీ సమీకరించుకొని తవాంగ్ ను కాపాడ గలిగింది. చివరికి చైనా యుద్ధంలో జస్వంత్ సింగ్ వీరమరణం పొందాడు. కానీ అతని వీరోచిత పోరాటానికి చైనా కమాండర్ కూడా సెల్యూట్ చేసి, జస్వంత్ తలను వెండి పళ్ళెంలో ఉంచి, భారత సైనికాధికారులకు అప్పగించాడు.” అంటూ జవాన్ చెప్పడం ఆపగానే ఒక్కసారిగా ఆ యుద్ధం లో నుంచి మనసు భారంతో నేనూ బయటకు వచ్చాను. ఇది కేవలం ఒక స్మారకం కాదు, ఒకే వ్యక్తి శక్తిగామారి ఆర్మీని ఆపగలడని చరిత్ర రుజువు చేసిన ప్రదేశం.

జస్వంత్ సింగ్ యుద్ధ స్మారకాన్ని 2016లో ఏర్పాటు చేసారు. అందులో ఆయన వాడిన బూట్లు, యూనిఫాం, బెల్టు, ఇతర వస్తువులు, మహావీర్ చక్ర రెప్లికా, యుద్ధానికి సంబంధించిన విషయంతో కూడిన సవివరమైన బోర్డులు ఉన్నాయి. జస్వంత్ సింగ్ మరణించిన తర్వాతనే భారత ప్రభుత్వం అతనిని ‘ మహావీర్ చక్ర ‘ పురస్కారంతో గౌరవంచిందని తెలిసి బాధ, ఆశ్చర్యం కలిగాయి. అయినా ఇలాంటివి మన ప్రభుత్వాలకు మామూలే అనే విషయం గుర్తుకు వచ్చి తమాయించుకున్నాను. పొట్టి శ్రీరాములు మరణించిన తర్వాతనే నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుమతి ఇచ్చాడు. ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న వాంగ్ చుక్ పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే.. మరో ప్రాంగణంలో ఒక చెట్టు ఉంది. జస్వంత్ సింగ్ అక్కడే చివరి శ్వాస విడిచాడని వాళ్ళ నమ్మకం. అతనిని అక్కడి ప్రజలు,సైనికులు ” జస్వంత్ సింగ్ బాబా ” గా పూజిస్తారట. అతని యూనిఫాంను ఇప్పటికీ శుభ్రం చేసి పెడతారట. అది చూడడానికి శుభ్రంగా, ఇస్త్రీతో ఖడక్ గా కనిపించింది. రాత్రి అతడు పెట్రోలింగ్ కు వచ్చినట్టు, టీ తయారు చేసి ఇచ్చినట్లు భావిస్తారు.

అందుకే కాబోలు అక్కడ పర్యాటకులకు కూడా వేడి వేడి టీ అందుబాటులో ఉంటుంది. ఆ చల్లటి వాతావరణంలో వేడి టీని తాగడం మనసుకు, శరీరానికి గొప్ప ఊరటనిచ్చింది. ప్రాంగణంలో మరో వైపు చైనా సైనికుల సమాధుల స్థలం ఉంది. అది ఐదువందల చైనా సైనికుల అవశేషాలను పూడ్చి పెట్టిన చోటని, దానిని 1965లో నిర్మించినట్లు అక్కడి బోర్డును బట్టి తెలుస్తోంది. మరో వైపు యుద్ధ బంకర్లు కూడా ఉన్నాయి. ఒక బంకర్లోనుంచి వెళ్ళి బయటకు వచ్చాను. ఫోటోలు తీసుకున్నాను. ఇక్కడి నుంచి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న. ‘ నూరానాoగ్ ‘ జలపాతo చూడడానికి వెళ్ళాం. పార్కింగ్ స్థలం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ నడక ఉంటుంది. దారి బురద, రాళ్ళతో కూడి ఉంది. సుమారు మూడు వందల అడుగుల ఎత్తునుంచి కిందకు పడుతున్న పాలధార లాగా ఉంది. ఫోటో కోసం దగ్గరగా వెళ్ళి, ఆ తుంపరలో తడిసి పోవడం మాటలకందని అనుభూతి. దాని కింద ఉన్న నదీతీరంలో నడక స్వర్గానికి మార్గం లాగా ఉంది. పచ్చని కొండలలో ఆ ప్రదేశాన్ని వదిలి రావాలని అనిపించలేదు. జస్వంత్ సింగ్ ఒంటరి పోరాటంలో అతనికి సహాయం చేసిన నూరా అనే స్థానిక యువతి పేరునే ఆ జలపాతానికి, నదికి పెట్టినట్లు గైడ్ రాహుల్ చెప్పాడు. అది విన్నప్పుడు జవాన్ చెప్పిన ఆ గిరిజన యువతుల సాహసo మరోమారు తలచుకొని అభినందించాను. దగ్గరలో ఉన్న ( తవాంగ్ జిల్లాలో ఉన్న ఒక ఊరి పేరు జంగ్. ) జంగ్ హైడెల్ ప్లాంట్ లో జలపాతం శక్తితో కరెంట్ ను ఉత్పత్తి చేసి, స్థానికంగా ఉపయోగిస్తారు. ఈ జలపాతానికి బాంగ్ బాంగ్, జంగ్ ఫాల్స్ అని మరో రెండు పేర్లు ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ మేం తవాంగ్ లోని హోటల్ కు చేరేసరికి రాత్రి ఏడున్నర అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *