“నోయిడాలోని టెక్స్‌టైల్ మరియు హోజరీ యూనిట్లలో మహిళా కార్మికులు 12 గంటల పనిదినాలను తగ్గించాలని మరియు ఉపయోగించదగిన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యూనిట్లలో నెలకొన్న కార్మికుల కొరత వల్ల పని గంటలు పెరిగి ఉండవచ్చు. ధరల పెరుగుదల మరియు వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల కార్మికులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడం (రివర్స్ మైగ్రేషన్) ఈ కొరతకు ప్రధాన కారణం. ఇంధన శక్తి రంగంలో వచ్చిన ఈ ప్రభావాన్ని అవకాశంగా మలుచుకోవచ్చు — పారిశ్రామిక కార్మికుల వేతనాలను పెంచడం ద్వారా వారి ఉత్పాదకతను కూడా పెంచవచ్చు..”
హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన చమురు ధరలను పెంచుతూ, భారతదేశంలో ఆందోళన కలిగిస్తోంది. సానుకూల పరిణామంగా అనిపిస్తూనే, ఏప్రిల్ 13న భారతదేశంలోని ఇరాన్ రాయబారి విలేకరులతో మాట్లాడుతూ భారత ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. జలసంధి గుండా వెళ్లే ఏ భారతీయ నౌకపై కూడా ప్రయాణ రుసుము విధించలేదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఏప్రిల్ 18న ఇరాన్ ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ రెండు భారతీయ ట్యాంకర్లపై కాల్పులు జరపడంతో ఆ ఊరట ఒక్కసారిగా మాయమైంది. అంతకుముందు ఒక ట్యాంకర్ విజయవంతంగా ప్రయాణించడం చూస్తుంటే, అక్కడ కమాండ్ స్ట్రక్చర్ విచ్ఛిన్నమైందని అర్థమవుతోంది. ప్రస్తుతం భారతీయ ట్యాంకర్ల పట్ల సమన్వయంతో కూడిన విధానాన్ని సాధించడానికి, ఆ బహుళ అధికార కేంద్రాలను గుర్తించి వారితో చర్చలు జరపడం అత్యవసరం. ఇది చెప్పినంత సులభం కాదు.
మరోవైపు, దిల్లీ పారిశ్రామిక శివార్లలో కార్మికుల అసంతృప్తి తీవ్రరూపం దాల్చి, ఏప్రిల్ 13న హింసాత్మకంగా మారింది. దీనికి సంబంధం ఉన్న మరో పరిణామం ఏమిటంటే, ఆ సాయంత్రం విడుదలైన మార్చి నెల భారత ద్రవ్యోల్బణ రేటు 3.4%గా నమోదైంది. ఫిబ్రవరిలో ఉన్న 3.2% నుండి ఇది స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, వెయిటెడ్ యావరేజ్ లెక్కల ప్రకారం ఇది ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత పెరిగిన వంట గ్యాస్ ధరల ప్రభావాన్ని కప్పిపుచ్చింది. సాధారణ 14.5 కిలోల సిలిండర్ల (ఎల్పీ జీ ) ధరను ప్రభుత్వం నియంత్రిస్తుంది, దీనిని రూ.60 పెంచి రూ.913గా నిర్ణయించారు. కానీ పారిశ్రామిక కార్మికులు సాధారణంగా వలస కూలీలు కావడంతో వారికి రిజిస్టర్డ్ కనెక్షన్లు ఉండవు. అనధికార మార్కెట్‌లో 2 కిలోల లేదా 5 కిలోల చిన్న సిలిండర్లను నింపుకునే చోట ధరల నియంత్రణ పట్టుతప్పుతుంది.
ఇది కొత్త వినియోగదారుల ధరల సూచిక పై విమర్శ కాదు, అది చాలా పకడ్బందీగా ఉంది . కానీ అనధికార మార్కెట్‌లో వంట గ్యాస్ ధరలు ఐదు రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు, అధికారిక ద్రవ్యోల్బణం సంఖ్య అసంబద్ధంగా మారుతుంది. సొంతంగా వండుకోవడానికి ఇంధనం లేని వారి కోసం రోడ్డు పక్కన ఫుడ్ కార్ట్‌లు నడుస్తున్నాయి. దిల్లీలో ఒక రోడ్డు పక్కన బండి వద్ద రూ.20కే భోజనం లభిస్తోంది, కానీ గతంలో పూర్తి కుల్చా ఇచ్చే చోట ఇప్పుడు సగం కుల్చా మాత్రమే ఇస్తున్నారు. దాంతో పాటు కొద్దిగా ఆలుగడ్డ కూర, అక్కడక్కడా ఒక శనగ గింజ, చిన్న ఊరగాయ ముక్క మాత్రమే పెడుతున్నారు . అక్కడి కస్టమర్లు ఎవరూ తినే ఆహరం తగ్గినా యుద్ధం గురించి ప్రస్తావించడం లేదు.
పారిశ్రామిక కార్మికుల వేతనాల స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హర్యానా ప్రభుత్వం కొన్ని నెలలుగా పెరుగుతున్న అసంతృప్తిని గమనించి, ఏప్రిల్ 1, 2026 నుండి కనీస వేతనాలను 35% పెంచి అభినందనీయమైన నిర్ణయం తీసుకుంది. ఆ పెరుగుదల పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వేతనాల కోసం ఆందోళనలకు దారితీసింది. ముడిసరుకు మరియు రవాణా ఖర్చులు పెరుగుతున్న క్లిష్ట సమయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య ఆధారిత వేతన పెంపుతో స్పందించింది, కానీ కాంట్రాక్టు కార్మికులకు ఇవి అమలు అవుతాయా లేదా అన్న ఆందోళన నెలకొంది.
2025 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ( PLFS ) ప్రకారం, తయారీ రంగంలోని సగం మంది కార్మికులు నెలకు గరిష్టంగా రూ.15,000 వేతనం పొందుతున్నారు. ఒకవేళ కాంట్రాక్టర్ ద్వారా పనిచేస్తే, వారి కమిషన్ పోగా కార్మికులకు మరింత తక్కువ అందుతుంది. మురికివాడల్లో 100 చదరపు అడుగుల చిన్న గదికి నెలకు రూ.5,000 అద్దె ఉంటుంది (కరెంటు, నీటి బిల్లులు కాకుండా). దీనివల్ల అత్యవసర పరిస్థితుల కోసం వారి వద్ద ఏమీ మిగలదు. వారి డిమాండ్ రూ.18-20 వేల మధ్య వేతనం. 2025 PLFS డేటా ప్రకారం, తయారీ రంగంలో ₹20,000 వేతనం అనేది ఎగువ శ్రేణి జీతాల పరిధిలోకి వస్తుంది.
నోయిడాలోని టెక్స్‌టైల్ మరియు హోజరీ యూనిట్లలో మహిళా కార్మికులు 12 గంటల పనిదినాలను తగ్గించాలని మరియు ఉపయోగించదగిన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యూనిట్లలో నెలకొన్న కార్మికుల కొరత వల్ల పని గంటలు పెరిగి ఉండవచ్చు. ధరల పెరుగుదల మరియు వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల కార్మికులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడం (రివర్స్ మైగ్రేషన్) ఈ కొరతకు ప్రధాన కారణం.
అధికారిక ద్రవ్యోల్బణం 3-4% స్థాయిలో ఉన్నప్పుడు, వేతనాల పెంపు కార్మికుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. మార్చి 9, 1776న ప్రచురితమైన ఆడమ్ స్మిత్ ప్రసిద్ధ గ్రంథం “An Inquiry into the Nature and Causes of the Wealth of Nations” 250 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దీనికంటే మెరుగైన మార్గం లేదు. ఉత్పాదకతే దేశాల సంపదకు అసలైన మూలమని ఆ గ్రంథం చెబుతోంది. భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కోసం ‘ధరల స్థిరీకరణ నిధి’ ( PSF) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇది 2014-15లో అత్యవసర వ్యవసాయ వస్తువుల కోసం ఏర్పాటు చేసిన నిధి వంటిదే (ప్రస్తుతం దీనికి ₹4,100 కోట్లు కేటాయించారు). అయితే, వ్యవసాయ వస్తువులపై ఉన్నంత నియంత్రణ ఇంధన ఉత్పత్తుల సరఫరాపై ఉండదు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి ఏప్రిల్ సమీక్ష ప్రకారం, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు తగ్గినా (3.1% మరియు 3.2%), భారతదేశ వృద్ధి రేటు ఈ ఏడాది మరియు వచ్చే ఏడాది 6.5%గా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ మే డే (మే 1) నుండి పారిశ్రామిక కార్మికుల జీవన ప్రమాణాలు, పని పరిస్థితులు మరియు తద్వారా దేశ ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా మనం అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాలను నిజం చేయాలి.
-ఇందిరా రాజరామన్
‘మింట్’ సౌజన్యంతో





