– అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆరఎస్ ప్యాకెట్ల సరఫరా
– తాగునీటి సమస్య లేకుండా చూడాలి
– ప్రకృతి విపత్తులతో నష్టం జరిగితే 15 రోజుల్లో నివేదిక పంపాలి
– హీట్ వేవ్ పై యాక్షన్ ప్లాన్ విడుదల
– 20 విభాగాలతో సమీక్షించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఎండలు, వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, జూన్ 15 వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై 20 సంబంధిత శాఖలతో మంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండియన్ మెటల్రాజికల్ శాఖ కలిసి సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ (హెచ్ఏపీ)-2026ను రూపొందించాయంటూ యాక్షన్ ప్లాన్‌ను మంత్రి విడుదల చేశారు. ఈ 45 రోజుల్లో రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మోటార్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేసి 15వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు ముఖ్యంగా పంచాయతీరాజ్, మున్సిపల్, ఫైర్, హెల్త్ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ప్రకృతి విపత్తుల బాధితులను ఆదుకోవడానికి వీలుగా 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికలను పంపాలని అధికారులను ఆదేశించారు. వడగాడ్పుల ప్రభావం ప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అనుకోని పరిస్ధితుల్లో ఎవరైనా చనిపోతే మానవతా దృక్ఫథంతో వ్యవహరించి తక్షణం ఎక్స్‌గ్రేషియా అందించాలని సూచించారు. వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండే నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్ద ఆడుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారని, అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ విభాగాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండలకు సంబంధించిన సమాచారం, అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని, ప్రజా ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్‌లో ఓఆరఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, అలాగే వేడి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేషన్ పద్దతి అవలంబించేలా పరిశ్రమలకు సూచించాలని తెలిపారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాల్లో అవసరమైన షెల్టర్లు, తాగునీరు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించాలని, స్ధానిక సంస్దలు, మున్సిపాల్టీలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





