– నోటిఫికేషన్ ఇచ్చాక స్టే ఎలా ఇస్తారు
– సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని హైకోర్టు
– రిజర్వేషన్లపై సిఎం రేవంత్ స్పష్టం చేయాలి
– లేకుంటే తెలంగాణ బంద్‌తో సత్తా చాటుతాం
– బిజెపి ఎంపి, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్9: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు స్టే విధించడంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు వద్ద ఆర్.కృష్ణయ్య డియాతో మాట్లాడారు..బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు. కొంతమంది బీసీలకు పదవులు వొస్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్.కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రంలోగా స్పందించక పోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల పక్రియను రెండు వారాల పాటు ఆపడమనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారు. నిన్నటి నుంచి విచారణ జరిపిన కోర్టు.. మరో రెండు రోజులు సమయం తీసుకుని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉండేదన్నారు. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం స్పందన ఏంటో చూస్తాం. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి రాష్టాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బీసీల్లో ఏంతో చైతన్యం వచ్చింది.. ఊరురా స్పందన తెలుపుతాం. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. సాయంత్రంలోగా ప్రకటించాలి. లేదంటే పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తాం. దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుంది. ఏం తమాషాగా ఉందా..? బీసీలంటే అంత చులకనగా ఉందా..? ముఖ్యమంత్రి పదవులు రావు మంత్రి పదవులు రావు.. లేక లేక సర్పంచ్ అవకాశం వస్తే వాటిని కూడా లాగేసుకోవడం సరికాదు. ఈ సమాజంలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించడం చాలా దురదృష్టకరం. రేపట్నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





