హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

~ ఎల్బీ స్టేడియంలో రేపు భారీ బహిరంగ సభ
~ గాంధీ భవన్‌లో కీలక సమావేశాలు
~ ఘన స్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం తదితరులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడినుంచి నగరంలోని తాజ్‌ కృష్ణ హోటల్‌కు ఖర్గే చేరుకున్నారు. ఎల్‌బీ స్టేడియం నుంచి రాష్ట్రస్థాయిలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులతో నేరుగా శుక్రవారం సాయంత్రం సమావేశమవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కేడర్‌ను సభకు తరలించేందుకు పార్టీ తరపున ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా సభా స్థలిలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ కానున్నారు. అందుకోసం వారికి ఖర్గే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా, ఆది శ్రీనివాస్‌, బాలునాయక్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు, సుదర్శన్‌ రెడ్డి, తదితరులు ఇప్పటికే తాజ్‌ కృష్ణాకు చేరుకున్నారు. తెలంగాణ విద్యా కమిషన్‌ చైైర్మన్‌ ఆకునూరి మురళి, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ అల్థాస్‌ జానయ్య సైతం ఖర్గేతో భేటీ కానున్నారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

గాంధీ భవన్‌లో శుక్రవారం ఖర్గే బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ నేతృత్వం వహిస్తారు. ఇందులో పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ నుంచి ఏఐసీసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రేణుకా చౌదరి, జానారెడ్డి వంటి సీనియర్‌ నేతలు పాల్గొంటారు. సమావేశంలో ప్రభుత్వ పాలనాతీరును, ప్రజా స్పందనను సమీక్షించనున్నారు. పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారంపైన, పార్టీకి ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చ జరగనుంది.

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

కాంగ్రెస్‌ తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత ఖర్గే గాంధీ భవన్‌లోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌, సీనియర్‌ మంత్రులు సహా టీపీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. సమావేశంలో వారి నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు స్వీకరిస్తారు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సంసిద్ధం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page