చికిత్స కోసం యశోదాలో చేరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గురువారం ఆయన సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులుగా కెసిఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి నగరంలో నందినగర్‌లోని తన నివాసానికి కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. గత వారం రోజులుగా జలుబు, దగ్గు, తలనొప్పితోపాటు జర్వం ఆయన్ని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. జూన్ 11న కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు. కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు ఆయన స్పష్టం చేశారు. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. దీంతో ఇన్ సైడ్ విచారణకు కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు జ్వరం తీవ్రం కావడంతో హాస్పిటల్‌కి తీసుకున వచ్చారు. కెసిఆర్ వెంట భార్య శోభారాణి, కెటిఆర్, హరీష్ రావు, మాజీ ఎంపి సంతోష్ కుమార్ ఉన్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం వాకబు
కేసీఆర్ ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన ఆయన చంద్రశేఖర్ రావుకు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.