– నదీ తీరాల్లో పుణ్యస్నానాలు
– ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో బుధవారం కిటకిటలాడాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. పుణ్య నదులలో స్నానాలాచరించి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు చేశారు. వరంగల్ వేయిస్తంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో తెల్లవారుజామునుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. జడల రామలింగేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుండే అలయానికి చేరుకొని దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, రaారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, పూజలు చేశారు. ధర్మపురి, బాసర, కాళేశ్వరంల వద్ద గోదావరి స్నానాలకు భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం ఆలయాల్లో దీపారాధనలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





