దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదా బిల్లులు ఈనెల 16వ తేదీన లోక్‌సభ ముందుకు రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. డిసెంబర్ 16న ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి.
ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.