దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా జమలాపురం టూరిజం పార్కు

  • ఎకో టూరిజం అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి
  • ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు

భార‌త‌దేశ టూరిజం చిత్ర‌ప‌టంలో జమలాపురం టూరిజం పార్కును అగ్రస్థానంలో ఉంచుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పలు రహదారులకు  టూరిజం పార్కు నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జమలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ. ఇండియా టూరిజం మ్యాప్ లో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం కల్పించేలా పర్యాటకంగా మండలాన్ని అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.  ఎర్రుపాలెం మండలంలో పర్యటించి రూ.5 .83 కోట్ల‌తో చేపట్టిన జమలాపురం అటవీ పార్క్ ‌పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి జమలాపురం దేవాలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజలు ఆకాంక్షించారని, దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో జమలాపురం చెరువు ట్యాంక్‌ ‌బండ్‌ ‌గా అభివృద్ధి చేసుకున్నామని, చెరువు కట్ట మీద రోడ్డు విస్త‌రించి గుట్ట మధ్య నుంచి రేమిడిచెర్ల వరకు రోడ్డు వేసుకున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం వొచ్చిన తర్వాత వెంటనే జమలాపురం చెరువు, పక్కన కాటేజ్‌ ‌కోసం పర్యాటక శాఖతో ప్రణాళికలు తయారు చేశామన్నారు.

  అటవీ శాఖ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అడవులను ధ్వంసం చేయకుండా, దానిని ఆస్వాదిస్తూ బతికేందుకు అవసరమైన కాటేజి అభివృద్ధి చేస్తే టూరిజం పెరుగుతుందని, దీనివల్ల స్థానిక ప్రజలకు ఆదాయం మెరుగవుతుందని తెలిపారు. టూరిజం అభివృద్ధి కావడం వల్ల ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతాయన్నారు. 6 నెలల్లో అటవీ పార్క్ ‌పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. బుచ్చిరెడ్డి పాలేనికి వెళ్లే రోడ్డు మార్గంలో ఇద్రీనమ్మ చెరువు దగ్గర కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ, నాగార్జున సాగర్‌ ‌నుంచి లింక్‌ ‌చేసి అక్కడ ఎప్పుడూ నీళ్లు ఉండే విధంగా, కాటేజ్‌, ‌పార్క్, ‌భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంట‌ర్నెట్  ద్వారా ప్రచారం చేస్తే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వొచ్చి ఆహ్లాదకరంగా ఇక్కడ గడుపుతారన్నారు. గతంలో తాగునీటి సరఫరా పనులు చేసే సమయంలోనే ఐదెక‌రాలు అధికంగా స్థలం సేకరించామని, ప్రస్తుతం ఆ స్థలం పార్కు ‌పర్యాటక ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. లక్ష్మీపురం నుంచి వొచ్చే ప్రజలకు అక్కడ రింగ్‌ ‌రోడ్డు మాదిరి ఉండేలా చేస్తున్నామని  తెలిపారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. 

జిల్లాలో మారుమూల మండలం ఎర్రుపాలెం అని, ఇక్కడ అధికంగా మనకు ప్రకృతిపరంగా అందమైన గుట్టలు అడవి ఉంది కాబట్టి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని, దీనివల్ల ఉద్యోగాలు, సంపద వస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. మన మండలానికి వొచ్చే పర్యాటకులు అతిథులతో సమానమని, వారిని గౌరవంగా చూసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడికి వొస్తే బాగా చూసుకుంటారనే పేరు రావాలని కోరారు.  మండలంలోని అడవి, చెరువులే మన ఆస్తి అని వీటిని మనం సంరక్షించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌ ‌మాట్లాడుతూ, డిజైన్‌ ‌నుంచి తుది అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన వరకు  ప్రజలకు ఉపయోగపడేలా జమలాపురం ఆలయానికి వొచ్చే భక్తులు ఆహ్లాదంగా గడిపేలా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. పార్క్ ‌శంకుస్థాపన కార్యక్రమానికి చాలా రోజుల నుంచి అధికారులు పడిన శ్రమ ఫలితమని అన్నారు. ఖమ్మం నగరంలో వారానికి దాదాపు 5 వేల మంది ప్రజలు వెలుగు మట్ల అర్బన్‌ ‌పార్క్ ‌కు వొచ్చి సరదాగా గడుపుతున్నారన్నారు. ప్రకృతిని కాపాడటం మన సంస్కృతిలో భాగమని, ప్రకృతితో కలిసి, మెలిసి అభివృద్ధి సాధించాలన్నారు.

అనంతరం చీఫ్‌ ‌కన్జర్వేటర్‌ ఆఫ్‌ ‌ఫారెస్ట్ ‌భీమా నాయక్‌ ‌మాట్లాడుతూ,  అటవీని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు అర్బన్‌ ‌పార్క్ ‌కార్యాచరణ తయారు చేశామ‌ని చెప్పారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పార్క్ ఉం‌డే విధంగా నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ‌డాక్ట‌ర్‌ పి.శ్రీజ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ ‌విక్రమ్‌ ‌సింగ్‌, ‌ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ ఎం.ఉషారాణి, ఆర్‌ఐ ‌రవికుమార్‌,  ‌రాజశేఖర్‌, ఎం‌పీడీవో, సురేందర్‌, ‌వైరా ఏసిపి.రెహమాన్‌, ‌మధిర సిఐ, డి మధు, ఎఫ్డివో మంజుల,  ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఎర్రుపాలెం మండల కాంగ్రెస్‌ ‌అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *