23 రాష్ట్రాలలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : తెలంగాణలో రామప్ప, సోమశిల పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. భారత పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (ఎస్ ఏఎస్‌సీఐ) పథకం కింద ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం కోసం 23 రాష్ట్రాలలోని 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.3,295.76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు 50 సంవత్సరాల కాలవ్యవధితో వడ్డీరహిత రుణాలు అందిస్తుంది. తద్వారా, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధి సృష్టి జరుగుతుంది.
ఇందులో తెలంగాణ నుంచి ఎంపిక చేసిన ప్రాజెక్టులు సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ (సుస్థిర పర్యాటక సర్క్యూట్స్) కింద రూ. 74 కోట్లతో రామప్ప ప్రాంతం.. వెల్ నెస్-స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల కింద రూ. 68 కోట్లతో సోమశిల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆదరణ పొందిన ఆయా పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించడం, అధునాతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వరకు, భారతదేశం యొక్క సహజమైన సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని అనుభూతి చెందాలనుకునే ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి అనేక రకాల చర్యలను చేపట్టనున్నామని వివరించారు.
గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక, పర్యాటక ప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. అందులో ముఖ్యంగా స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ. 92 కోట్లతో సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ ను అభివృద్ధి చేసింది. ప్రసాద్ పథకం కింద రూ. 62 కోట్లతో రామప్ప ఆలయం అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీటితోపాటుగా స్వదేశ్ దర్శన్ పథకం కిందనే రూ.80 కోట్లతో ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత వాటర్ ఫాల్స్‌ను కలుపుతూ గిరిజన సర్క్యూట్ ను.. రూ.97 కోట్లతో కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ %-% పైగా టూంబ్స్ %-% హయత్ బక్షి మసీదు %-% రేమండ్స్ టూంబ్స్ కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ ను నరేంద్రమోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అలాగే, ప్రసాద్ పథకం కింద రూ.42 కోట్లతో భద్రాచలం రాముల వారి ఆలయం, రూ.37 కోట్లతో ఆలంపూర్ జోగులాంబ ఆలయం, రూ.4.5 కోట్లతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేసి వేగవంతంగా అభివృద్ధి పనులను చేపడుతోంది. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
వీటితోపాటుగా స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.57 కోట్లతో భువనగిరి కోట అభివృద్ధి, రూ.38 కోట్లతో అనంతగిరి ఎకో టూరిజం ప్రాజెక్టులను, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ పథకం కింద రూ.25 కోట్లతో నల్గొండ కల్చర్ %•% హెరిటేజ్ ప్రాజెక్టు, రూ.10 కోట్లతో కామారెడ్డి (కల్కి చెరువు) ఎకో టూరిజం ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరు చేశామని, ఇవే కాకుండా వరంగల్ కోట, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలకు, ఉస్మానియా యూనివర్సిటీ, ట్యాంక్ బండ్ లకు సౌండ్ అండ్ ఇల్యూమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు, నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టుకు నిధులు, వేయిస్తంభాల గుడి అభివృద్ధి, సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు, ఎపిగ్రఫి మ్యూజియం, మింట్ మ్యూజియం, కొమురం భీమ్ గిరిజన మ్యూజియం ఏర్పాటు వంటి అనేక రకాల చర్యలను చేపట్టి తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవాన్ని ప్రజలకు, భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.