ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం చల్లారినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే టెహ్రాన్ కాల్పుల విరమణను మొదలుపెట్టగా సీజ్ ఫైర్‌ను తామూ అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి అణుముప్పు తొలగిపోయిందని నెతన్యాహు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలియజేశారు.
దిగొస్తున్న క్రూడాయిల్ ధరలు, దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
న్యూదిల్లీ: కాల్పు ల విరమణ ప్రకటనతో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లలో సానుకూల పవనాలు మొదలయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కలవరపెట్టిన క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇజ్రాయెల్- ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ముడిచమురు ధరలు 5 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రకటన అనంతరం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.53 డాలర్లు లేదా 4.94 శాతం తగ్గుముఖం పట్టి 67.95 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రకం కూడా 5 శాతం మేర క్షీణించి బ్యారెల్ 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వారం కనిష్ఠానికి చేరాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇటీవల అమెరికా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణుస్థావరాలపై యూఎస్ దాడి చేసింది. దీంతో హర్మూజ్ సంధి మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేసింది. ఇదే జరిగితే బ్యారెల్ చమురు ధర 80 డాలర్లు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దీనివల్ల ప్రధానంగా దిగుమతులపై ఆధారపడే మన దేశానికి ద్రవ్యలోటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణమూ పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళ్తున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 945 పాయింట్ల లాభంతో 82,842.37 వద్ద కొనసాగుతుండగా.. నిప్టీ సైతం 302 పాయింట్ల లాభంతో 25,274.55 వద్ద ట్రేడయింది.