– గరిమిని బయటకొదులుతూ చల్లగుంటున్న పాలకులు
– నిప్పుల గుండాల్లో మాడుతున్న సామాన్యులు
– పుణెలో 58°C రోడ్డు ఉష్ణోగ్రత
– రాత్రి వేళల్లోనూ తప్పని వేడి నరకం
– అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రకోపం
– కాగితాలకే పరిమితమైన హీట్ యాక్షన్ ప్లాన్లు
(మేకల ఎల్లయ్య, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
భూగోళం భగ్గుమంటోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పట్టణాలు, నగరాలు, పల్లెలు నిప్పుల గుండాల్లా మారుతున్నాయి. పాలకులేమో ఏసీ గదుల్లో సేదతీరుతుంటే, సామాన్య జనం మాత్రం సూర్యుడి దహనకాండకు విలవిలలాడుతున్నారు. వాతావరణ శాఖ చెప్పే గాలి ఉష్ణోగ్రతలకు, భూమిపై తారు రోడ్లు, కాంక్రీట్ కట్టడాలు ఉద్గారించే వేడికి మధ్య ఆకాశానికీ, భూమికీ ఉన్నంత అగాధం కనిపిస్తోంది. గాలి ఉష్ణోగ్రత 38°C ఉంటే, పుణె లాంటి నగరాల్లో రోడ్డు ఉపరి తల ఉష్ణోగ్రత ఏకంగా 58°Cకి చేరడం భవి ష్యత్తు వినాశనానికి నిదర్శనంగా నిలు స్తోంది. గడిచిన రెండు దశాబ్దాలలో కాంక్రీటీ కరణ పెరిగి, పచ్చదనం 30 శాతం క్షీణించ డంతో పట్టణాలు ‘అర్బన్ హీట్ ఐలాండ్స్’గా మారుతున్నాయి. పగలు పీల్చుకున్న వేడిని రాత్రి వేళల్లో కాంక్రీట్ భవనాలు, తారు రో డ్లు వాతావరణంలోకి వదులుతుండడంతో రాత్రిళ్లు కూడా జనం వేడి నరకాన్ని అనుభవి స్తున్నారు. ఈ పరిస్థితి కేవలం నగరాలకే కా దు. అడవుల నరికివేతతో పల్లెలకూ విస్తరిం చింది. ఫలితంగా శ్రామికుల జీవనోపాధి దెబ్బతినడమే కాక, పంటల దిగుబడి పడిపో తోంది. దేశవ్యాప్తంగా వందలాది ‘హీట్ యా క్షన్ ప్లాన్లు’ ఉన్నప్పటికీ, నిధుల కొరత, పాల కుల నిశ్చేష్టత కారణంగా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. నిరుపేదలు, అసంఘటి త రంగ కార్మికులు ఎండల బారిన పడి
ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వాల్లో చలనం లేదు. తక్షణమే ‘కూల్ రూఫ్’ విధానాన్ని చ ట్టబద్ధం చేసి, వృక్షసంపదను పెంచే శాస్త్రీయ పద్ధతులను యుద్ధప్రాతిపదికన అమలు చేయకపోతే.. రాబోయే తరాలు అగ్నిగుండం లో బూడిదవడం ఖాయమని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ సూచించే గాలి ఉష్ణోగ్రత కు, రోడ్లు, కాంక్రీట్ కట్టడాల వంటి భౌతిక ఉపరితలాల ఉష్ణోగ్రతలకు మధ్య ఉండే అగా ధాన్ని ఇటీవల మహారాష్ట్రలోని పుణె నగరం స్పష్టంగా ప్రతిబింబించింది. ఒక ప్రదేశంలో గాలి ఉష్ణోగ్రతను సూర్యరశ్మి నేరుగా పడని నీడ గల ప్రదేశంలో, నేల నుంచి దాదాపు 1.5 మీటర్ల ఎత్తులో కొలుస్తారు. దీనికి విరుద్ధంగా, నేరుగా సూర్యుడి కిరణాలకు గురయ్యే తారు రోడ్లు, సిమెంట్ కాంక్రీట్ స్లాబ్లు నిరంతరం సూర్యతాపాన్ని గ్రహిస్తూ ఉంటాయి. పుణెలోని డీపీ రోడ్ వంటి ప్రాం తాల్లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం, గాలి ఉష్ణోగ్రత 38°C ఉన్నప్పుడు రోడ్డు ఉప రితల ఉష్ణోగ్రత ఏకంగా 58°Cకి చేరుకో వడం వెనుక తారు రోడ్ల తక్కువ ఆల్బెడో ఉద్గార శాతమే ప్రధాన కారణం. తారు, నల్ల టి కాంక్రీటు పదార్థాలు తమపై పడే సూర్యకాంతిని పరావర్తనం చేయలేక, ఉష్ణ శక్తిని నిల్వ ఉంచే థర్మల్ మాస్‌గా పనిచేస్తాయి.ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని మరింత తీవ్రతరం చేయడంలో వాహనాల రాకపోకలు, రోడ్ల పక్కన వృక్షసంపద లేకపోవడం కీలక పాత్ర పోషిస్తాయి. పుణెలో కర్వే స్టాచ్యూ, డీపీ రోడ్ వెంబడి నిర్వహించిన మైక్రోక్లైమేట్ విశ్లేషణ ప్రకారం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు నేరుగా రోడ్డు ఉపరితలాన్ని తాకడం వల్ల వేడి మరింత పెరుగుతుంది. దీనికి భిన్నంగా, నదీ వంతెనల సమీపంలో, మర్రి, రావి, గుల్మోహర్, బాదం వంటి దట్టమైన ఆకులు కలిగిన చెట్ల నీడ ఉన్న చోట ఉపరితల, గాలి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదయ్యాయి. కాంక్రీట్ కట్టడాలు సమాన పరిమాణంలోని గాలి కంటే సుమారు 2,000 రెట్లు ఎక్కువ వేడిని నిల్వ ఉంచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే ఈ ఉష్ణోగ్రత అగాధానికి ప్రాథమిక భౌతిక శాస్త్ర సూత్రం.
వేగంగా మారుతున్న థర్మల్ డైనమిక్స్
ఉపగ్రహ ఆధారిత విశ్లేషణలు, చారిత్రక డేటా ప్రకారం గత దశాబ్దాలతో పోలిస్తే భారత్ లోని నగరాలు, పట్టణాల్లో ఎండల తీవ్రత, ఉపరితల ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరిగాయి. పుణె నగరంలో భూ వినియోగ, భూ కవర్ (ల్యాండ్ యూస్, ల్యాండ్ కవర్ – ఎల్ యూఎల్ సీ) మార్పులపై జరిగిన పరిశోధనలు ఈ సత్యాన్ని నిరూపిస్తున్నాయి. పుణెలో సగటు ఎల్ఎస్‌టీ ఉష్ణోగ్రత 2000 సంవత్సరంలో 34.59℃ ఉండగా, అది 2022 నాటికి 39.38℃ కి చేరుకుంది. కేవలం దశాబ్ద కాలంలోనే సగటు వేసవి ఉష్ణోగ్రతలలో 2.9℃ సగటు పెరుగుదల నమోదైంది. నగర విస్తరణ, కాంక్రీటీకరణ పెరగడం వల్ల నార్మలైజ్డ్ డిఫరెన్షియల్ బిల్ట్ ఇండెక్స్ (ఎన్ డీబీఐ) విపరీతంగా పెరిగింది. పుణె నగరంలో బిల్ట్-అప్ ఏరియా 2000 సంవత్సరంలో కేవలం 7 శాతం ఉండగా, అది 2022 నాటికి ఏకంగా 47 శాతానికి విస్తరించింది. అదే సమయంలో పచ్చదనం వృక్షసంపద విస్తీర్ణం దాదాపు 30 శాతం మేర క్షీణించింది. పచ్చదనం కోల్పోయిన పుణె సరిహద్దు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగాయి. ఇది కేవలం పుణెకు మాత్రమే పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలో తీవ్రమైన ఉష్ణగాలుల (హీట్ వేవ్స్) ప్రభావంతో ఏప్రిల్ 2026 లో ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉన్న 100 నగరాలలో 95 నగరాలు భారతదేశంలోనే ఉండడం తీవ్రమైన పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది.
రాత్రివేళల్లోనూ వేడి నరకం
దేశంలోని నగరాలు, పట్టణాల్లో పగటి వేళల్లో ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం అంతకంటే భయంకరమైన సవాలుగా మారింది. ఐఐటీ భువనేశ్వర్ పరిశోధనల ప్రకారం భారతదేశంలోని 141 ప్రధాన నగరాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల రేటు దశాబ్దానికి సగటున 0.53℃ గా నమోదైంది. ఇది దేశవ్యాప్త సాధారణ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఈ దృగ్విషయాన్ని అర్బన్ హీట్ ఐలాండ్ (యూహెచ్ఐ) ప్రభావంగా పిలుస్తారు. పగటిపూట సూర్యతాపాన్ని గ్రహించి నిల్వ చేసుకున్న నల్లటి తారు రోడ్లు, సిమెంట్ భవనాలు రాత్రి వేళల్లో ఆ వేడిని నెమ్మదిగా వాతావరణంలోకి వదులుతాయి. ఇరుకైన వీధులు, ఎత్తైన భవనాల సాంద్రత కారణంగా ఆకాశం కనిపించే కోణం (స్కై-వ్యూ ఫ్యాక్టర్) తగ్గిపోయి, వాతావరణంలోకి వేడి తప్పించుకోలేక నగర పరిధిలోనే చిక్కుకుపోతుంది. దీనికి తోడు వాహనాలు, పరిశ్రమలు, ఎయిర్ కండిషనర్ల (ఏసీ) వాడకం వల్ల విడుదలయ్యే మానవజనిత వేడి (వేస్ట్ హీట్) పట్టణ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. ఈ వేడిని తట్టుకునేందుకు పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో సైతం ఏసీల వాడకం విపరీతంగా పెరగడం ద్వారా వాతావరణంలోకి మరింత వేడి గాలి విడుదలవుతూ, ఒక విషవలయంగా మారుతోంది. రేకుల కప్పులు, ఇరుకైన సందులు, వృక్షసంపద లేకపోవడంతో ఈ రాత్రి వేళల ఉష్ణోగ్రతల పెరుగుదల మానవ శరీరం ఉష్ణోగ్రతల నుంచి కోలుకునే అవకాశాన్ని హరించివేసి, గుండెపోటు, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తోంది. రాత్రి పూట నిద్రలేమితోపాటు ఉష్ణ అలసట, అధిక విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. తీవ్ర ఉష్ణ అసమానత, పేద ప్రజల శారీరక ఆరోగ్యం క్షీణిస్తోంది.
గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్న దహనకాండ 
ఎండల తీవ్రత కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాలు కూడా నేడు కుంపట్లలా మండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం క్షీణించడం, తీవ్రమైన అడవుల నరికివేత కారణంగా స్థానిక ఉష్ణోగ్రతలు నగరాలకు సమానంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ వ్యవస్థల్లో వచ్చిన మార్పులు వర్షపాతాన్ని అస్థిరపరిచాయి. మధ్య భారతదేశంలోని అటవీ ప్రాంతాలలో జరిగిన పరిశోధనలు ఈ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. అడవుల క్షీణత, ఉష్ణోగ్రత పెరుగుదల పరస్పరం ప్రభావితం చేసుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో తేమ శాతం తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఈ విధంగా భూమి వేడెక్కడం వల్ల గ్రామీణ శ్రామికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోంది. వ్యవసాయ రంగం పూర్తిగా వాతావరణ మార్పులపై ఆధారపడి ఉండడంతో, పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. ఉష్ణోగ్రత ప్రతి 1℃ పెరిగితే గోధుమ దిగుబడి దాదాపు 4 నుంచి 5 మిలియన్ టన్నులు తగ్గుతుందని ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వ్యవసాయ కాలాల మార్పులు, పశువులు, పెంపుడు జంతువులలో పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తున్నాయి.
అమలు కాని హీట్ యాక్షన్ ప్లాన్లు
దేశంలో ఉష్ణ సంక్షోభం కేవలం ఒక వాతావరణ విపత్తు కాదు. ఇది తీవ్రమైన పాలనా లోపాలను, సామాజిక అసమానతను ఎత్తిచూపుతోంది. భారతదేశంలో సుమారు 200 కంటే ఎక్కువ హీట్ యాక్షన్ ప్లాన్లు (హెచ్ఏపీ) రూపొందించబడినప్పటికీ, వాటి అమలులో తీవ్ర నిశ్చేష్టత కనిపిస్తోంది. అధిక శాతం హెచ్ఏపీలకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో అవి కేవలం తాత్కాలిక, ప్రతిచర్యాత్మక చర్యలకే పరిమితమవుతున్నాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో కూడా వేసవి మరణాలు సంభవించే వరకు ప్రణాళికలను అధికారికంగా అమలు చేయకపోవడం ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యాన్ని చాటుతోంది. అహ్మదాబాద్ హెచ్ఏపీ సౌత్ ఆసియాలోనే మొదటి ప్రణాళిక. సున్నం పూసే పైలట్ ప్రాజెక్ట్, ప్రారంభ హెచ్చరికల వ్యవస్థ. రాజ్‌కోట్ కూలింగ్ ప్లాన్ భారతదేశంలో మొట్టమొదటి అర్బన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. భువనేశ్వర్ కూలింగ్ ప్లాన్ దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. వీటిని అమలు చేయని పాలనా లోపాలు సమాజంలోని అత్యంత బలహీన వర్గాలైన నిరాశ్రయులు, అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, పేద మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కార్మికులకు మధ్యాహ్నం వేళల్లో విశ్రాంతి ఇవ్వాలనే మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, దినసరి వేతన కార్మికులు ఆ సమయాల్లో పని మానేస్తే ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో తీవ్ర ఎండల్లోనూ శ్రమించక తప్పడం లేదు. రేకుల ఇండ్లలో నివసించే పేద మహిళలు వంట చేసే సమయంలో ఇండ్ల లోపలి వేడి తట్టుకోలేక రాత్రి వేళల్లో పనులను చేసుకోవాల్సి వస్తోంది. ఇది వారి శారీరక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తోంది. వాతావరణ విశ్లేషణల ముసాయిదా తయారీలో ఢిల్లీ హెచ్ఏపీ వైఫల్యం చెందింది. తీవ్రమైన అమలు లోపాలు, సకాలంలో నోటిఫై చేయకపోవడం, నిధుల కొరతతో ప్లాన్ అమలు కాకపోవడంతో నిరాశ్రయులైన నిరుపేదలు ఎండల బారిన పడి అత్యధికంగా మరణిస్తున్నారు.
‛కూల్ రూఫ్’ రూల్స్ అమలు చేయాలి
భారతదేశం ఒక వైపు వాతావరణ మార్పుల తీవ్రతను అనుభవిస్తున్న తరుణంలో, ఈ దహన సంక్షోభం నుంచి బయటపడడానికి శాస్త్రీయమైన, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను తక్షణమే అమలు చేయాల్సి ఉంది. ఇందుకు కేవలం స్వల్పకాలిక నీటి వసతులు కల్పించడం సరిపోదు. పట్టణాల నిర్మాణ శైలిలోనే విప్లవాత్మక మార్పులు రావలసి ఉంది. భవనాల పైకప్పులకు సూర్యతాపాన్ని పరావర్తనం చేసే పదార్థాలను పూయడం (కూల్ రూఫ్స్ ప్రోగ్రామ్) అత్యంత సమర్థవంతమైన మార్గమని రుజువైంది. ఇది ఇండ్ల లోపలి ఉష్ణోగ్రతలను దాదాపు 2 నుంచి 5 వరకు తగ్గించడమే కాకుండా, విద్యుత్ వినియోగాన్ని కూడా నిరోధిస్తుంది. అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాలలో జరిగిన పైలట్ ప్రాజెక్టుల విజయవంతమైన ఫలితాలను ప్రాతిపదికగా తీసుకొని జాతీయ స్థాయిలో ‘కూల్ రూఫ్’ మార్గదర్శకాలను తప్పనిసరి చేయాలి. అదేవిధంగా ప్యాసివ్ కూలింగ్, ప్రకృతి ఆధారిత పరిష్కారాలైన పట్టణ పచ్చదనం పెంపుదల, నీటి వనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. కాంక్రీట్ రోడ్ల మధ్య వృక్ష కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా, రోడ్ల డిజైన్లలో సూర్యకాంతి నేరుగా పడకుండా భవనాల నీడలు పడేలా నిర్మించడం ద్వారా ఉపరితల ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చు. ఆధునిక డిజిటల్ ట్విన్, జియోఏఐ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ప్రతి వార్డు స్థాయిలో అత్యధిక వేడి ఉన్న హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ తగిన ప్రణాళికలు అమలు చేయాలి. చివరగా అత్యంత ముఖ్యమైన చర్యగా హీట్ యాక్షన్ ప్లాన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రత్యేక బడ్జెట్ నిధులను కేటాయించాలి. అసంఘటిత కార్మికుల పని గంటలను మార్చడం, వారికి నష్టపరిహార భృతిని కల్పించడం వంటి కార్మిక సంక్షేమ చర్యలను పటిష్టంగా అమలు చేయాలి. వృక్షసంపద పునరుద్ధరణ కార్యక్రమాలలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ వాతావరణాన్ని సమతుల్యం చేయవచ్చు. వాతావరణ మార్పుల తీవ్రత పెరిగిపోతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో, భారతదేశం తక్షణమే ఈ సమగ్ర వ్యూహాలను కార్యాచరణలోకి తీసుకురాకపోతే భవిష్యత్తు తరాలు ఒక అగ్నిగుండంలో బతకాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





