– రిటైర్ అయిన వారికి పెన్షన్ లేదు.. బెనిఫిట్స్ లేవు
– లా అండ్ ఆర్డర్‌లో పూర్తి వైఫల్యం
– బీఆర్‌ఎస్ జీరో అయ్యింది
– మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్ రామచందర్ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బ్రిటిషర్ల అణచివేతకూ, నైజాం దమనకాండకీ ఎదురు నిలబడి పోరాడిన తెలంగాణ యోధుడు కుమ్రం భీం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. అసమర్థ పాలన, నిర్లక్ష్య వైఖరితో రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిందన్నారు. ధాన్యం కొనండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను జైలుకు పంపితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని రోడ్లపైకి తీసుకొచ్చిందన్నారు. టాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్, హమాలీ చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తున్నదని, సివిల్ సప్లయిస్ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమీషన్ ఇస్తున్నదని, మరి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు హామీ ఇచ్చిన విధంగా బోనస్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంఎస్పీకి పంట కొనుగోలు చేయాలని, మిల్లులకు అమ్ముకునేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు తమకు రావలసిన బెనిఫిట్స్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెండేళ్లుగా పెన్షన్, పీఎఫ్ డబ్బులు రావడం లేదని, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించిందని ఆయన తెలిపారు. ఈ రెండేళ్లల్లో అనేకమంది రిటైర్ అయిన ఉద్యోగులు ఇలాంటి ఇబ్బందుల వల్ల చనిపోయారనే వార్తలు చూస్తున్నాం.. ఇది బాధాకరం అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్(జీపీఎఫ్), గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) బకాయిలు రూ.12 వేల కోట్లు మేర ఉన్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు ఇస్తామని చెప్పి పైసా కూడా విడుదల చేయలేదని తెలిపారు. కేసీఆర్ పాలనలోని రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరినే కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని విమర్శించారు. ఐదు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాంయంటూ ప్రభుత్వ నిర్లక్ష్యంఉద్యోగులు, రైతులు.. అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లా అండర్ పూర్తిగా విఫలం
రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, సాధారణ పౌరుడికి రక్షణ లేదని, పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ నగరంలో ఒక డీసీపీపై దాడి జరిగిన ఘటన ఎంతో విచారకరమన్నారు. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే పోలీసు అధికారులపై దాడి చేసిన వారినే ఎంఐఎం నాయకులు పరామర్శించడానికి వెళ్లడం.. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో ఎంఐఎం ఎమ్మెల్యే రౌడీల దాడిలో గాయపడ్డ డీసీపీని కలవలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయింది కానీ జూబ్లీహిల్స్‌లో గెలిస్తే వీళ్ళ ఆరు గ్యారంటీలు కొత్త మేనిఫెస్టోలా మారతాయని ఎద్దేవా చేశారు. జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేత మొదటి గ్యారంటీ. వసూళ్లకు, హఫ్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు రెండవ గ్యారంటీ. బెదిరింపులు, దౌర్జన్యాలపై కేసులు నమోదు చేయకపోవడం మూడవ గ్యారంటీ. వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు రూ.50వేల పింఛన్ నాల్గవ గ్యారంటీ. రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు 5వ గ్యారంటీ. భూకబ్జాలు, సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ ఆరో గ్యారంటీ. ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. ఎలాంటి రాజ్యం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై డీజీపీకి తాను లేఖ రాశానని, చాదర్‌ఘాట్ ఘటన జరగకముందే దాని గురించి హెచ్చరించానని తెలిపారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అమరవీరుల పట్ల కూడా అన్యాయం జరిగిందన్నారు.
బీఆర్‌ఎస్ జీరో
బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయిందంటూ వాళ్ల కారు రాజకీయంగా పంక్చర్ అయిపోయింది. ఒకప్పుడు మజ్లిస్ గ్యారేజ్‌లో ఉండే ఆ కారు బయటకు వచ్చినా ఇప్పుడు పంక్చర్ అయింది. డ్రైవర్ లేరు.. స్టీరింగ్ లేదు.. టైర్లు ఊడిపోయాయి.. అంటే ఆ కారు ఇప్పుడు పర్మనెంట్‌గా షెడ్‌లోనే ఉండిపోయింది. అలాంటి కారులోనుండి బయటకు వచ్చిన వాళ్లు ఏం మాట్లాడినా దానికి స్పందించాల్సిన అవసరమే లేదన్నారు.
మజ్లిస్‌ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలి
కాగా, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇన్‌చార్జిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, వేముల అశోక్, చంద్రశేఖర్ జి,రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌కు బీజేపీకి మధ్యనే పోటీ జరుగుతోందని, జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని తెలిపారు. మజ్లిస్‌ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీకి అవకాశాలు పెరుగుతున్నాయంటూ బీజేపీని గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చేసేందేమీ లేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





