– సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు చేరువ
– ప్రభుత్వంతో శభాష్ అనిపించుకుంటున్న కలెక్టర్ హనుమంతరావు
– కలెక్టర్‌గా ఏడాది కాలం పూర్తి
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తనదైన శైలిలో ఉత్తమంగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు మరపురాని సేవలందిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఈ నెల 28వ తేదీ నాటికి ఏడాది కాలం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా, విద్య, వైద్యం, సంక్షేమం, జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. జిల్లాలో అన్ని రంగాలపై దృష్టి సారిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, అమ్మకు భరోసా, పల్లె నిద్ర, హాస్టల్ నిద్ర, ప్రజావాణి, ఉద్యోగవాణి వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. విద్యా సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ రాత్రి బసలు చేస్తూ పాఠాలు బోధిస్తూ విద్యాలయాల్లో వసతులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లక్ష్యం వైపు స్పష్టతను ఇస్తూ భవిష్యత్ ప్రణాళికపై మార్గదర్శిగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఫోకస్ పెట్టారు. గత ఏడాది పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 200 మందికి సైకిళ్ళను బహుమతిగా అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. విద్యార్థులపై శ్రద్ధ పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చూశారు. జిల్లాలోని 675 ప్రభుత్వ పాఠశాలల్లో వాష్ రూమ్స్, తాగు నీరు, వంట గదులు, సిసి కెమెరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇతర అధికారులు కూడా హాస్టల్ నిద్ర చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ వారి లక్ష్యాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి రోజూ స్కూల్స్‌ను తనిఖీ చేస్తూ నాణ్యమైన మెనూ ప్రకారం భోజనాన్ని విద్యార్థులకు అందించేలా కలెక్టర్ కృషి చేస్తున్నారు.
స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమానికి పటిష్ట చర్యలు
అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేస్తూ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. బాలింతలకు పౌష్టికాహారం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్, మందులు అందజేయడంలో కలెక్టర్ ముందున్నారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ఆరా
జిల్లా ఏరియా హాస్పిటల్, అన్ని మండలాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పల్లె దవఖానాలను క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. హాస్పిటల్ ఆవరణ, లోపల పారిశుధ్య చర్యలు, మందులు, వ్యాక్సిన్ల నిల్వలు, ఓపీ, ఇన్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు, వైద్యం అందిస్తున్న తీరు, మందుల పంపిణీపై ఆరా తీస్తున్నారు. పేషంట్లతో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశిస్తూ ప్రతి గురువారం ప్రజల సమస్యలపై ప్రజావాణి, ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ వాణి కార్యక్రమాలు సమర్థంగా నిర్వహిస్తున్నారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారం కోసం గ్రామ సభలో సమస్యలు తెలుసుకుంటూ తన పరిధిలో అప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి కలెక్టర్ చొరవ చూపుతున్నారు.
విజయవంతంగా ప్రభుత్వ కార్యక్రమాలు
ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా చేపట్టారు. భూ భారతి, నూతన ఆఆర్ చట్టం పై అన్ని మండల కేంద్రాల్లో విజయవంతంగా అవగాహన సదస్సుల నిర్వహింపజేశారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా మహిళా సమాఖ్య భవనం ఏర్పాటుకు కృషి చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్లు ప్రారంభం, విజయవంతంగా నిర్వహణ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు.
ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులు దూరం
మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉద్దేశంతో జిల్లాలోని మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయించడమేగాక విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేసేలా ప్రణాళిక అమలు చేశారు. పలువురితో క్యాంటీన్లు, ఇతర ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించారు. తమకు మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్న కలెక్టర్‌కు మహిళలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞలు తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, కమీషన్ డబ్బులు ఇప్పించారు.
మంత్రుల నుంచి ప్రశంసలు అందుకుంటూ..
ప్రభుత్వ ఆలోచన, ఆదేశాల మేరకు పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా శాసనమండలి పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వారి ప్రశంసలు అందుకుంటూ జిల్లా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





