-టెండర్ ప్రక్రియ ప్రారంభం
– మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తి
– ఆధార్ ఒక్కటే కాదు.. నివాస ధ్రువీకరణకు పలు పత్రాలు చెల్లుబాటు
– ఇల్లు రాకపోతే ₹10 వేల ఈఎండీ వంద శాతం తిరిగి చెల్లింపు
– దరఖాస్తులకు ఆగస్టు 10 చివరి తేదీ
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ టవర్స్ పథకం కింద తొలి విడత గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో శుక్రవారం మాట్లాడిన ఆయన ఇందిరమ్మ టవర్స్ సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అది పూర్తికాగానే పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరం క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 8 వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాలతోపాటు మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థలాల గుర్తింపు పూర్తయిందని, దశలవారీగా మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని విస్తరిస్తామని చెప్పారు. పేద కుటుంబాలు కూడా హైదరాబాద్‌లోని అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గౌరవప్రదమైన జీవితం గడపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తే కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు వాటిని నమ్మలేదని, ప్రస్తుతం భారీగా వస్తున్న దరఖాస్తులే ఇందిరమ్మ టవర్స్‌పై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వానికి చెందిన వందల కోట్ల విలువైన భూముల్లో టవర్స్ నిర్మించి ప్రతి లబ్ధిదారునికి 20 నుంచి 22 గజాల అన్‌డివైడెడ్ షేర్‌ను ఉచితంగా వారి పేర రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. భూమి విలువతో కలిపి ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇళ్ల కేటాయింపు, నిర్మాణం చేపడుతున్నామని, అందువల్ల ఏ నియోజకవర్గానికి చెందిన వారు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తుదారులు నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను కూడా సమర్పించవచ్చని మంత్రి తెలిపారు. దీంతో ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ఆలోచన లేదని, ఆగస్టు 10లోపు తప్పనిసరిగా దరఖాస్తులు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఇంటి కోసం చెల్లించే రూ.10 వేల ఈఎండీ విషయంలో ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హత లభించని వారికి వంద శాతం మొత్తం తిరిగి చెల్లిస్తామని మరోసారి స్ఫష్టం చేశారు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈఎండీ చెల్లిస్తే అదే బ్యాంకు ఖాతాకు నేరుగా రీఫండ్ జమ అవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల విషయంలో పారదర్శకత, బాధ్యతతో ముందుకు సాగుతుందని, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు జరిగేలా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తోందన్నారు. ఎవరి పట్లా కక్షపూరిత వైఖరి లేకుండా సామాన్య ప్రజలు హర్షించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనే చేపడుతోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




