– చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి
– అభిమాన నాయకుడి మరణంతో ఉమ్మడి జిల్లాలో విషాదం
– ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర
– పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక పాత్ర
– కడసారి చూసేందుకు నర్సంపేటకు భారీగా వచ్చిన ప్రజలు
వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ ఉద్యమ కెరటం, కేసీఆర్ ప్రధాన అనుచరుడు, నర్సంపేట రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రైతు బాంధవుడు, రాష్ట్ర సాధన సమయాన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనదైన ముద్ర వేసి అందరి మన్ననలు పొందిన ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు. ఈ వార్తను నర్సంపేట ప్రజలే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. ఈ నెల 26న తీవ్రమైన గుండెపోటు రావడంతో హనుమకొండలోని రోహిణి హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి హైదరాబాద్‌కు తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 12.51 గంటలకు కన్నుమూశారు. తమ అభిమాన నాయకుడు, ఉద్యమ సారథి పెద్ది ఇకలేరనే విషయాన్ని నర్సంపేటతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు నమ్మలేకపోతున్నారు. పెద్ది అకాల మరణం వరంగల్ జిల్లాలో విషాదాన్ని నింపింది. ఆయన మృతికి ఉమ్మడి వరంగల్‌తోపాటు యావత్ రాష్ట్ర ప్రజలంతా తమ నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన సుదర్శన్ రెడ్డి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంటే నడిచారు 2001లో టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఎన్నికై ఆ తర్వాత 2002లో రాష్ట్ర కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి మొదటి వరుసలో నిలిచారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ సాధన కోసం ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించిన భారీ బహిరంగ సభను వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో పెద్ది అధ్యక్షతన నిర్వహించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆరఎస్ నిర్వహించిన ప్రధాన సభల బాధ్యతలను పెద్ది సుదర్శన్ రెడ్డికే కేసీఆర్ అప్పగించేవారు. ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ భారీ సభ కూడా ఆయన నిర్వహణలోనే జరిగింది. అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు ప్రజలకు ఏమి చేశామనేదే ముఖ్యమనే భావనతో పనిచేసిన నాయకుడు పెద్ది. 2014లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సహకారంతో నర్సంపేట నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి పాకాల సరస్సు నింపి నర్సంపేట ప్రజల గుండెల్లో రైతు బాంధవుడిగా చిరస్మరణీయమైన ముద్ర వేశారు. మాదన్నపేట వాగుపై సిద్దాం నిర్మించి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేశారు. రైతు బాంధవుడిగా సుదర్శన్ రెడ్డి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేశారు.
నర్సంపేటకు భౌతిక కాయం.. భారీగా జనం.. 2కి.మీ మేర ట్రాఫిక్ జామ్ 
సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేటకు చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసి పలువురు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. మా నాయకుడు ఇక లేరు అంటూ విలపించారు. పార్థివ దేహం నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు. అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై 2 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





