మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృత పర్యటన
ఇల్లందులో రూ 15.38 కోట్లతో అభివృద్ధి పనులు
కొత్తగూడెం/ఇల్లందు, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిమండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు ఎమ్మల్యే కోరం కనుకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలసి విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ 15.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు బిటీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా సింగ్య తండా నుంచి గొల్లగూడెం వెళ్ళు 2.2 కిలోమీటర్ల రహదారి, ఎర్రాయి గూడెం
గ్రామం నుంచి చింతలకట్ట గ్రామం వరకు రహదారి, దాసు తండా నుంచి ఎర్రబోడు వరకు 3.8 కి.మీ రహదారి పనులకు, బొడ్డుగూడెం పంచాయతీ రోడ్డు నుండి బంగారం పల్లి వయా బర్లగూడెం వరకు నాలుగు కిలోమీటర్ల రహదారి, పెద్ద చర్లపల్లి గ్రామం వరకు గంగారం నుండి ఉలవచిలక గ్రామం వరకు నిర్మించనున్న ఎస్‌టిఎస్‌టిఎఫ్ నిధులు రూ 15.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలన్నారు. రానున్న పది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం చేపడతామన్నారు. అర్హులైన పేదవారి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతగా స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్తోమత లేని పేదవారికి ఇంటి నిర్మాణం కోసం రూ 5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. టేకులపల్లి మండలం గంగారం గ్రామంలో వున్న ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్నిమంత్రి ఆకస్మికంగా తనిఖీ. ఈ తనిఖీలో భాగంగా మంత్రి వసతి గృహంలో వంటశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పిస్తున్నారా లేదా అని అడిగారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. వసతి గృహంలో పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులకు బెడ్లు ఉన్నాయా, వారికి చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యల పరిష్కారానికై ప్రజలు తెచ్చిన దరఖాస్తులను మంత్రి స్వీకరించి దరఖాస్తుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా టేకులపల్లి తాసిల్దారు భవాని ని ఆదేశించారు.ఈ పర్యటనలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాలశ్రీనివాస్,కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లెనినా, మిషన్ భగీరథ ఇఇ తిరుమలేష్,నళిని,జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.