హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంటున్న సమష్టి నిర్ణయాలతో పది నెలలో ఇంతటి పురోగతి సాధ్యమైందనిఅన్నారు. ముందెన్నడూ లేనిరీతిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడే అందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. 66.7 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి భారత్ లోనే అరుదైన రికార్డ్ అని తెలిపారు ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అనడానికి ఈ దిగుబడి చక్కటి ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్లతో నిర్మించనున్న రహదారులకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
అనంతరం కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రమిలా రమేష్ తో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పేజ్-2 తో వొచ్చిన నీటిని కాళేశ్వరం జలాలు అంటూ గత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. అటువంటి కాళేశ్వరం నిరుపయోగంగా మారినా ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న మెడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లు పనిచేయకపోయినా ఇంతటి ధాన్యం దిగుబడి అయిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనతేనని ఆయన కొనియాడారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయం పేదప్రజల పట్ల ప్రభుత్వానికున్న సంకల్పానికి అద్దం పడుతోందన్నారు అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారిగా సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించి అమలు పరచడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ ఘనతేనని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేశామన్నారు. 1,48,517 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నాలకు బోనస్ రూ.476.31 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.251.88 కోట్ల చెల్లించినట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన సంవత్సరంలోపే 50 వేల ప్రభుత్వ ఉద్యగాలు భర్తీ చేయడం తెలంగాణలో చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది నెలల్లోనే 11వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టమన్నారు. ఈ నెల 4న పెద్దపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మరో నాలుగు వేలమందికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు అంతే కాకుండా యువతకు ఉపాధి ఉద్యోగావకాశల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా పారిశ్రామిక ఆధారిత వృత్తి నైపుణ్య కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు తరలివొస్తున్నారన్నారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త ఆయాకట్టను సేద్యంలోకి తీసుకొచ్చేందుకు బృహత్ ప్రణాళికలు రూపొందించి అమలు పరుస్తున్నామన్నారు. అంతే కాకుండా చెరువులు కుంటలు పునరుద్ధరించి జలాశయాలను పెంపొందించనన్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ మహనగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్రోల్, డీజిల్ బస్సుల స్థానంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 1000 బస్సుల తయారీకి ఆదేశాలిచ్చిందని అందులో 250 బస్సులు హైదరాబాద్ కు చేరాయన్నారు. మొత్తం ఈ 1000 బస్సులలో హైదరాబాద్ కు 500 కేటాయిస్తున్నామని, మరో 500 గ్రామీణ ప్రాంతాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో నిర్మించ తలపెట్టిన క్రీడా విశ్వవిద్యాలయం దక్షిణ భారతదేశానికే తలమానికం కానుందన్నారు. అధికారంలోకి వొచ్చిందే తడవుగా మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలలో ఒక మైలురాయి అని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఉచిత ప్రయాణంలో 115 కోట్ల మంది మహిళలు పర్యటించారన్నారు. తద్వారా మహిళలకు సుమారు రూ.3,870 కోట్లు మిగిలాయని ఆయన చెప్పారు. గృహజ్యోతి పథకం పేద ప్రజలకు వరంగా మారిందన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకుంటున్నవారికి ఉచితంగా విద్యుత్ అందిచండం ప్రభుత్వం సాధించిన విజయాలలో ఒకటని అన్నారు. మార్చి 2024 నుండి మొదలైన గృహజ్యోతి పథకంలో ఇప్పటి వరకు 49లక్షల 51 వేల 725 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్నారు. 350 ప్రభుత్వ సబ్సిడీతో కేవలం రూ.500 లకే ప్రభుత్వం అందిస్తున్న వంటగ్యాస్ పథకం సామాన్యులకు వరంగా మారిందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో వంటగ్యాస్ సబ్సిడీ పధకం కింద కోటి 25 లక్షల 20 వేల 892 మంది లబ్ధిదారులకు ప్రయోజనం జరిగిందన్నారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు గాను స్వయం సహాహాక బృందాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. ఒక్కో మహిళకు స్వయం ఉపాధి ద్వారా నెలకు రూ.10వేల ఆదాయం వచ్చే రీతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఎస్.సి,ఎస్ టి బి.సి లతో పాటు ఈ బి సి విద్యార్థులకు ప్రపంచ స్థాయిలోఉన్నత విద్యనందించేందుకు ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ స్థాయి సమీకృత పాఠశాలల ఏర్పాటుకు అంకురార్పణ చేశామన్నారు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఈ పాఠశాల నిర్మాణం ఉంటుందన్నారు. పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఏనాడు ఆ ప్రభుత్వం వసతి గృహాల మెస్ చార్జీలను పట్టించు కోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన అనతి కాలంలొనే భారీ ఎత్తున పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యపడుతుందన్నారు. అందులో భాగమే కులగణన అని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఎస్.సి వర్గీకరణ చేపడుతున్నామన్నారు అందులో భాగంగ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను నియమించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.