– ప్రతీ పేద కుటుంబం సొంతింట్లో పండుగ జరుపుకోవాలి
ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 7 : పేదల సొంతింటి కలను నెరవేర్చి వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి భరోసా కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రతీ పేద కుటుంబం తమ సొంతింట్లో సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో లబ్దిదారుడు ఈసం నాగరాజు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి శనివారం పాల్గొన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, జిల్లా ఇన్చార్జి మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాగరాజు కుటుంబం సొంతింట్లో పండుగ జరుపుకుంటున్న ఆనందాన్ని పంచుకోవడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. గతంలో గవర్నర్గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని మహిళల అభ్యున్నతికి, గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని మంత్రి గుర్తు చేశారు. గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇళ్లు లేని పేదలకు సొంతింటి వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్నారు. కొండపర్తి గ్రామస్తులకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, సునీల్, కల్తి రమేష్, గ్రంథాలయ సంస్థ, పీఏసీఎస్ ప్రతినిధులు, తాజా, మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





