ఇం‌దిరమ్మ ఇళ్లు నిరుపేదలకే..

తొలి ప్రాధాన్యతలో కేటాయింపు
దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట
లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి
పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేస్తాం
సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ఇం‌దిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ ‌యాప్‌ ‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని.. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ‌జ్యోతి బుద్ధప్రకాష్‌, ‌ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page