పెరుగుతున్న ధరలు
వ్యవసాయం, అంతర పంటలపై రైతులకు ఆసక్తి తగ్గుతోందా?
కేంద్రం తాజాగా వైద్య ఖర్చులు, నిత్యావసర ధరలపై వెల్లడిరచిన నివేదిక చూస్తే.. మతి పోవడం ఖాయం. వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది తయారు చేశారు. వీరు దేశవ్యాప్తంగా 1,114 పట్టణాల్లోని మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో సిద్ధం చేశారు. దాని ప్రకారం ఈ ఆగస్టు నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా కీలకమైన నిత్యావసర సరుకుల ధరల్లో వ్యత్యాసం, సరుకుల వారీగా, రాష్ట్రాల వారీగా పేర్కొంది. ధరల జాతీయ సగటు దాదాపు వంద శాతం నుంచి రెండు వందల శాతం వరకు పెరిగినట్లు వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సీఎఫ్‌పీఐ) 2024 నివేదిక వెల్లడిరచింది. చాలా రాష్ట్రాల్లో సరైన సాగు పద్ధతులు లేకపోవడంతోపాటు పెట్టుబడి కూడా ఎక్కువ కావడంతో ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
గతంలో పల్లె జనాభాలో డెబ్భై శాతానికిపైగా రైతు కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లోనూ దాదాపుగా అందరూ వ్యవసాయంలో భాగస్వాములు అయ్యేవారు. కానీ, ఇప్పుడు పల్లెల్లో రైతులు యాభై శాతం కూడా లేరు. నిజానికి పల్లెల్లో వ్యవసాయం ఇప్పుడు ప్రధాన వృత్తి కాదు. రియల్ ఎస్టేట్, రిటైల్ షాపులు సహా బట్టల దుకాణాలు, చికెన్ షాపులు ఇలా ఎన్నో ఉప వృత్తుల వైపు రైతు కుటుంబాలు దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయం, అంతరపంటలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. గతంలో ప్రతి ఇంటికీ కూరగాయల పాదులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెల పెంపకం ఉండేది. కానీ, ఇప్పుడు వాటి పెంపకం రైతు కుటుంబాల జీవనశైలికి ఆటంకంగా మారింది. ఏదైనా పెళ్లి పేరంటానికి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే కోళ్లు, మేకలు, గేదెల కోసం ఎవరో ఒకరు తప్పక ఉండాల్సి వస్తుంది. అందుకు చాలామంది సిద్ధంగా లేకపోవడంతో వాటి పెంపకమే తగ్గిపోయింది. పల్లెల్లోకి కూడా ప్యాకెట్ పాలు వస్తుండటంతో ఆవులు, బర్రెలను పెంచాల్సిన అవసరం ఏమున్నది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో అంతరపంటలు సహా ప్రధాన పంటలకు విత్తనాలు సొంతంగా అభివృద్ధి చేసుకునేవారు.
ఇప్పుడు కంపెనీలే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుండటం.. అంతరపంటల విత్తనాలు నాసిరకంగా ఉంటుండటంతో చాలామంది రైతులు శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా గ్రామాల్లో ఆదాయం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు బోడకాకరకాయ పల్లెల్లో పెంటలపై మొలిచేది. వాటిని చాలామంది తినేవారు కూడా కాదు. కానీ, ఇప్పుడు పట్టణాల్లో దాని ధర కిలో 200 పైమాటే. పూర్వం రైతులు వరి, పెసర, కంది సజ్జలు, నువ్వులు, ఉలవలు, రాగులు, మినుములు పజ్జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, మక్కజొన్న, బుడ్డ శనగలు, అలసంద, గోధుమ తదితర పంటలు సాగు చేసేవారు. ఈ సంప్రదాయ వ్యవసాయం వల్ల పల్లెల్లో గ్రామీణ స్వయం పోషక విధానం ఉండేది. కానీ.. ఇప్పుడు చిరుధాన్యాలు, ఆరుతడి పంటల సాగు తగ్గిపోయింది. దీంతో మనం చిరుధాన్యాలు, పప్పు దినుసులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతుండగా.. సామాన్యుడు బతకలేని పరిస్థితికి వచ్చింది. వ్యవసాయం చేయడం దండుగ అని ఇప్పటికే చాలామంది రైతులు అభిప్రాయపడు తున్నారు. తమ పిల్లలను మాత్రం ఈ రొంపిలోకి దింపొద్దని బలంగా అనుకుంటున్నారు. చాలామందిలో ఈ అభిప్రాయం ఉండటంతో అసలు వచ్చే కొన్నేళ్లలో వ్యవసాయంలోకి కొత్త తరం వస్తుందా? అనే భయాలు నెలకొన్నాయి.
గతంలో ప్రతి రైతు తమకు ఉన్న నైపుణ్యాలతో సాగు మెళకువలు పెంచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తూ దిగుబడి పెంచుకునేవారు. రకరకాల ఉపయోగకరమైన చిరుధాన్యాలు సహా పప్పు దినుసులు సాగు చేసేవారు. కానీ, ఇప్పుడు ప్లలెల్లో ప్రధానంగా వరి.. తర్వాత మొక్కజొన్న, పత్తి తప్ప మిగతా పంటలపై దృష్టి పెట్టడంలేదు. వరికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుండటంతో పంటకు మినిమం గ్యారంటీ అన్న కోణంలో రైతులు ఆలోచిస్తున్నారు. కానీ, చిరుధాన్యాలు, పప్పుదినుసులు పండిస్తే అంతకుమించి లాభం వస్తుందని రైతులకు తెలిసినా.. ధైర్యం చేయలేకపోతున్నారు. అకాల వర్షాలకు ఇతర పంటలు నష్టపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదని.. దిగుబడి అనుకున్నంత రాకపోతే ఎలా అన్న భయాలు వారిని కొత్త పంటల దిశగా ఆలోచించనీయడంలేదు. ప్రభుత్వాలు, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు చొరవ తీసుకుని రైతులకు తగిన సలహాలు ఇస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
మరోవైపు, పిల్లల చదవుల కోసం చాలా మంది యువ రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. పల్లెల్లోని మౌలిక వసతుల లేమి వల్ల పట్టణాలు నగరాలకు వలస పోతున్నారు. వాచ్‌మన్ ఉద్యోగాలు, లేబర్ పనులు కూడా చేయడానికి వెనుకాడటం లేదు. చాలా రైతు కుటుంబాలు వ్యవసాయం నుంచి తప్పుకుంటుండటంతో రాబోయే రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంలోకి అడుగుపెడతాయి. రైతులనుంచి భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తాయి. పూర్తి యాంత్రీకరణతో ఆహార ఉత్పత్తులపై పూర్తి ఆజమాయిషీ సాధిస్తాయి. అప్పుడు కిలో రూ. 1000 అయినా ఆశ్చర్యం ఉండదు.
పైగా కార్పొరేట్ కంపెనీలు అగ్రదేశాలకు ఎగుమతి చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాయి.. కార్పొరేట్ కంపెనీలు వ్యవసా యంపై ఆజమాయిషీ సాధిస్తే దేశంలో ఆహార లభ్యత సహా ఆహారపుటలవాట్లు కూడా వారే నిర్దేశించే పరిస్థితి వస్తుంది. దేశంలో సగటున వ్యక్తి ఆదాయం 12 ఏళ్లలో రెట్టింపైనా.. జీవన ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సామాన్యుల రోజువారీ జీవనానికి కావాల్సిన నిత్యావసర వస్తువుల నుంచి వైద్యం వరకూ ఖర్చులు అంతే స్థాయిలో పెరిగాయి. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టి సారించి..వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిచేందుకు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
-కందుల శ్రీనివాస్