లగచర్లలో భూ సేకరణ రద్దు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
భూ సేకరణ నిలిపివేస్తూ ఉత్వర్వులు జారీ

వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల భూ సేకరణ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. భూ సేకరణ చట్టం-2013 లోని సెక్షన్‌ 93 ‌ప్రకారం.. లగచర్ల భూ సేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్‌ ‌విడుల అయింది. గ్రామాల్లో అభిప్రాయ సేకరణ తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌వెల్లడించారు. అయితే, భూ సేకరణ నోటిఫికేషన్‌పై దుద్యాల మండలం తహసీల్దార్‌ ‌కిషన్‌ను వివరణ కోరగా.. లగచర్ల గ్రామంలో భూసేకరణ ఉపసంహరణ పబ్లిక్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల ఆయన మాట వాస్తవమేనని, కానీ జిల్లా కలెక్టర్‌ ‌నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదని వెల్లడించారు.
అలజడి రేపిన ఘటన
కాగా, వికారాబాద్‌ ‌జిల్లా  దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో భూ సేకరణ విషయంలో అభిప్రాయ సేకరణకు వెళ్లి కలెక్టర్‌, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడం రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాడికి పాల్పడిన సుమారు 50 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి వివిధ పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు. అయితే, కలెక్టర్‌, అధికారుల దాడిలో కుట్ర కోణం ఉందంటూ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కొడంగల్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ ‌రెడ్డి, అతడి ప్రధాన అనుచరుడు భోగమోని సురేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
image.png
ఈ క్రమంలోనే లగచర్ల బాధితులంతా కలిసి దిల్లీలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, ‌జాతీయ మానవ హక్కుల కమిషన్‌, ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌ను కలిసి వారిపై పోలీసులు చేసిన దాడులు, అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేశారు. అయితే, వారి ఫిర్యాదు మేరకు ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్‌ ‌సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌ ‌కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపింది. కానీ, అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల భూసేకరణపై వెనక్కి తగ్గింది. భూ సేకరణను ఉపసంహరించుకుంటున్నట్లుగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page