శారీరక సాక్షరత ప్రాముఖ్యత పెరగాలి

– పుల్లెల గోపీచంద్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : శారీరక సాక్షరత ప్రాధాన్యత క్రీడాకారులకు మాత్రమే కాక సమాజంలోని ప్రతి వర్గానికీ తెలియాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఫిజికల్ లిటరసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం నిర్వహించిన యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్–2026 కార్యక్రమంలో ఆయన ‘ఫిజికల్ లిటరసీ’ అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. యువత సాధికారత, ఫిట్‌నెస్ ప్రోత్సాహం ప్రధాన లక్ష్యాలుగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ క్రీడారంగం దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చే ముఖ్యమైన రంగాల్లో ముందుంటుందని, ఆరోగ్యవంతమైన సమాజం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్సు అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ ఎ.సోనిబాలా దేవి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ స్థాయిలో క్రీడల ప్రోత్సాహంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్-2026 ద్వారా శారీరక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, క్రీడల్లో సామాజిక భాగస్వామ్యాన్ని విస్తరించడం, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, రవితేజ, గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, కోచ్‌లు, యువ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *