ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం అండ

– ధ్రువపత్రాలు, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
– రికార్డుస్థాయిలో 1050మందికి ధ్రువ పత్రాల మంజూరు
– మీ బంగారు భవిష్యత్తుకు మాది భరోసా
– మంత్రి సీతక్క హామీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని, వారి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం అందజేస్తున్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో సోమవారంనిర్వహించిన చైల్డ్ సేఫ్టీ-ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో నివసిస్తున్న విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆఫ్టర్ కేర్ విద్యార్థులకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి కీలక పత్రాలను మంత్రి సీతక్క అందజేశారు. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో 1055 మంది పిల్లలకుì ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. అలాగే ఈగల్ ఫోర్స్ తరఫున స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం సే నో టు డ్రగ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో సర్టిఫికెట్ల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్యలను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసిందని వివరించారు. అనాధ పిల్లలకు ఏకకాలంలో వేల సంఖ్యలో ద్రువీకరణ పత్రాలు అందజేయడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ ధ్రువపత్రాలు కేవలం కాగితాలు కావు.. ఇవి మీ భవిష్యత్తుకు బాటలు వేసే సాధనాలు అని మంత్రి పేర్కొన్నారు. కుటుంబ ఆదరణ లేకపోయినా కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చిన విద్యార్థులను అభినందించారు. వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మీ జీవితాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారు ఉంటారు.. కానీ మీరు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి అని ఉద్బోధించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయంటూ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ ఉద్దేశాన్ని వివరించారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే వేలాది ధ్రువపత్రాలు అందజేశామని, మిగతా ప్రక్రియలు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికీì ప్రభుత్వ సేవలను చేరవేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందుతున్నదని, బాలల భద్రత, పునరావాసం, విద్య, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి చెప్పారు. ప్రతి చిన్నారి భద్రంగా ఉండాలి.. ప్రతి యువకుడు సరైన దిశలో ఎదగాలి.. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి.. అదే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతుంది అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, అధికారులు విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వం, అధికారులు, సామాజిక సంస్థలు కలిసి ప్రతీ విద్యార్థి భవిష్యత్తు కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, వచన్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి, ఈగల్ ఫోర్స్ అధికారులు గిరిధర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *