మే 7 నుంచి 31వ తేదీ వరకు పోటీలు
తెలంగాణ ఖ్యాతి..పర్యాటకానికి మహర్దశ
ప్రీ ఈవెంట్ వేడుకల్లో మంత్రి జూపల్లి వెల్లడి
హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని వీరు ప్రపంచానికి తెలియజేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీని హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈక్రమంలో బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీజీ టీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా తదితరులు పాల్గొన్నారు.
అందాల పోటీలతో నగరానికి ప్రపంచ ఖ్యాతి
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి అందాల భామలు వొస్తారని తెలిపారు. ఇది మహిళా సాధికారతకు అద్దం పట్టే సంబరాలు అని, ప్రపంచ దేశాల నుంచి రాబోయే అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇప్పటికే ధనిక నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది, ఈ పోటీలతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పెరుగుతుందని అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రపంచ వేదికపై తక్కువగా ప్రాచుర్యం పొందింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌తో మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం లభించింది. ఇది రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు సహాయపడనుంది. కొంతమంది ఈ ఈవెంట్‌ను రాజకీయ కోణంలో చూస్తున్నా, ఇలాంటి అంతర్జాతీయ వేడుకలు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు, తెలంగాణ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉపయోగపడతాయని మంత్రి స్పష్టం చేశారు.
ఈ పోటీల్లో పాల్గొనే వారితో పాటు వేలాది మంది దేశ విదేశాలకు చెందిన వారు తెలంగాణకు వస్తారని అన్నారు. ఈ వేదిక వల్ల నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెరుగుతుందని తెలిపారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగలమని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.54 కోట్లు పెట్టు-బడి పెట్టామని చెప్పారు. అందులో సగమే ప్రభుత్వం కేటాయిస్తుందని..మరో సగం ప్రమోటర్‌ల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు. ఇది చరిత్రాత్మక కార్యక్రమమని.. సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నెలవు అని వ్యాఖ్యానించారు. మహిళల అంతః సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీ-ల ఉద్దేశమని అన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో మహిళలకు అన్ని రంగాల్లో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చారు. సౌత్ కొరియా స్క్విడ్ గేమ్, బీటీ-ఎస్ బ్యాండ్ లాంటివి దేశ ఎకానకి ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పెరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగానూ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, రాజకీయ కోణంలో ఈ పోటీలను చూడటం సరికాదని మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు.