మెగా జాబ్‌ మేలా రెండోరోజూ కొనసాగింపు

– విశేష సంఖ్యలో నమోదవడంతో పొడిగింపునకు నిర్ణయం
– రెండో రోజూ కొనసాగుతున్నందున ఒత్తిడికి గురికావొద్దు
– నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్‌ సంకల్పం

– మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్‌ మేలాకు అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో రెండో రోజు కూడా కొనసాగించాలని నిర్ణయించినట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రానికి నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 36 వేలకు చేరిందని, ఆ సంఖ్య జాబ్‌ మేలా సమయానికి 40 వేలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతోపాటు డీఈఈటీ, సింగరేణి కాలరీస్‌ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ జాబ్‌ మేళాలో పాల్గొనే నిరుద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ఏర్పడనున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని రెండో రోజు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. రెండోరోజు కుడా కొనసాగుతున్నందున నిరుద్యోగ యువత ఎలాంటి ఒత్తిడికి లోను కావాల్సిన అవసరం లేదన్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులందరికీ అవకాశం ఇవ్వాలన్న కోణంలోనే రెండో రోజుకు పొడిగించినందున తాపీగా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద నిరుద్యోగ యువతకు ఉన్న విశ్వసనీయతకు మెగా జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు నమోదైన అభ్యర్థుల సంఖ్య అద్దం పడుతోందన్నారు. తాజాగా జరిగిన గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగ నియామకాల ప్రక్రియతో కలుపుకుని రెండేళ్ల వ్యవధిలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన నేపథ్యంలో తాము ఇప్పుడు నిర్వహిస్తున్న మెగా జాబ్‌ మేళాకు ఇంతటి స్పందన లభించిందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ సంకల్పం మేరకు నిర్వహిస్తున్న ఈ జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పరిశ్రమలన్నీ కలుపుకుని మొత్తం 275 పరిశ్రమలు ముందుకొచ్చాయని మర్రతి తెలిపారు. భాషా పరిజ్ఞానంతో పట్టణ ప్రాంత యువతకు ఉపాధి సునాయాసంగా లభిస్తుందని, వెనుకబడిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఈ మెగాజాబ్‌ మేళాను మారుమూల ప్రాంతంలో నిర్వహిస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page