– పర్యావరణ అనుముతులు చెల్లుబాటు
– సుప్రీంకోర్టులో ఉపశమనం
న్యూదిల్లీ, జూలై 29 : తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను సుప్రీంకోర్టు కొట్టివేసినా ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీంతో తెలంగాణలో కొనసాగుతున్న ఈ కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి చట్టపరమైన ఆటంకం ఉండదని స్పష్టత వచ్చింది. అదే సమయంలో భవిష్యత్తులో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్టాలను భర్తీ చేయడం సాధ్యంకాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలంటే కేందప్రభుత్వం చట్టబద్ధమైన నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని సూచించింది. ఇప్పటికే పూర్తయిన లేదా నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజెక్ట్ పనులకు ఎలాంటి అంతరాయం ఉండదని న్యాయస్థానం పేర్కొనడంతో తెలంగాణ ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులకు ఇది కీలక ఊరటనిచ్చిన తీర్పుగా భావిస్తున్నారు.
సుప్రీం తీర్పుపై మంత్రి తుమ్మల హర్షం
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయినట్లేనన్నారు. సీతమ్మ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీరు నిల్వ చేసి 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని, 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు, సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





