– భూమి సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం
– అటవీ శాఖ మంత్రి సురేఖ
మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 29: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం అని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దూలపల్లిలోని స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించారు. పులుల సంరక్షణకు సంబంధించిన లఘు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పులుల సంరక్షణ ప్రాధాన్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రకృతి పరిరక్షణకు ఒక గొప్ప వేదికగా నిలిచిందన్నారు. పులి అటవీ సంపదకు ప్రతీక అని, పులిని పరిరక్షించడమంటే అడవిని, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని, భావితరాల భవిష్యత్తును పరిరక్షించడమేనని అన్నారు. వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా వంటి కారణాలతో వాటి సంఖ్య తీవ్రంగా తగ్గిపోయిందని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నాటి ప్రధాని ఇందిరా గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని, 1973లో ‘ప్రాజెక్ట్ టైగర’ను ప్రారంభించి దేశవ్యాప్తంగా పులుల సంరక్షణకు బలమైన చర్యలు చేపట్టారని వివరించారు. ఈ చర్యల ఫలితంగానే నేడు భారతదేశం ప్రపంచ పులుల సంరక్షణలో అగ్రగామిగా నిలిచిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75 శాతం పులులు భారత దేశంలోనే ఉన్నాయని, దేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి కూడా ఈ విషయంలో విశిష్టమైన స్థానం ఉందని మంత్రి అన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన పులుల అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని చెప్పారు. అటవీ సంపదను పరిరక్షించడంలో నిబద్ధత, నిజాయతీ, సేవాభావంతో పనిచేసి భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అటవీదళాల ప్రధాన సంరక్షణాధికారి వినయ్ కుమార్, కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ దండా రాజిరెడ్డి, సీసీఎఫ్ (డెవలప్‌మెంట్) రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ టీజీఎసఎఫఎ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్, సీసీఎఫ్ ఎన్ క్షితిజ, టైగర్ సెల్ రీసర్చ్ సైంటిస్ట్ అయాన్ సాధు, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రసాద్, కవాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన పలువురు అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశాంస పత్రంతోపాటు, రివార్డును మంత్రి సురేఖ అందించారు. అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్ర లేఖన పోటీలో గెలిచిన విద్యార్థులకు మంత్రి సురేఖ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





