కాంగ్రెస్ లో’ ముసలం ‘పుట్టిందా!?

“అంతర్గత బలహీనతలు సొమ్ము చేసుకునే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య. కనుక ముసలం ముదిరి పాకానపడుతున్నట్లే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని స్థితి, మరోవైపు సగం సగం అమలు జరిపిన అసంతృప్తి, కొన్నింటిని ఆపేసుకుంటున్న స్థితి ,నిధులు కొరత ఆ పార్టీకి శాపంగా పరిణమిస్తుండ గా మరోవైపు కాంగ్రెస్ నేతల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..”

-ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు)
సెల్:9441864514, email: thirmal.1960@gmail.com

అధికార కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడుతుంది.ఏ ఉమ్మడి జిల్లా చూసినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు రోజు రోజుకు శృతిమించి రాగాన పడుతున్నాయి.విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థాంతరంగా తన పర్యటన ముగించుకొని హుటా హుటీన హైదరాబాద్ చేరుకున్నారు .ఆయన విదేశీ పర్యటన ముందు పరకాలలో రగిల్చిన రాజకీయ అగ్ని మంటలై మండుతుంది.మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి మీద విరుచుకు పడిన తీరు కాంగ్రెస్ లో సీట్లు సిగపట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఓ ముందస్తు సినిమా చూపిస్తున్నాయి.ఆమె మాట్లాడిన డైపర్ భాష జుగుప్సాకరంగా ఉంది.ఆమెపై కౌంటర్ గా కాంగ్రెస్ మహిళా నాయకులు విరుచుకు పడిన తీరు కూడా సొంత పార్టీ వాళ్ళతో మాట్లాడిన విధంగా లేదు అంతకన్నా దారుణంగా ఉంది.ఒకరకంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కొండా వర్గం,ప్రత్యర్థి వర్గాల మధ్య రెండుగా చీలి కుమ్ములాడుతున్నట్లు కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ వర్గ పోరు ముదిరి కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి బహిరంగ అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఏకంగా ఆయన ప్రత్యార్థి మేఘ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం నే కలిసి చిన్నారెడ్డి పై ఫిర్యాదు చేశారు.ఇప్పటికే కరీంనగర్ జిల్లా లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం బిఆర్ యస్ తీర్థం పుచ్చుకుంది.అదే బాటలో పయనిస్తానని చిన్నారెడ్డి ప్రకటించారు.ఇక నల్గొండ జిల్లా లో సైతం ఏ ఒక్క శాసన సభ్యుడు,మంత్రి మధ్య సమన్వయం లేదు.మంత్రి పదవి ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కారాలు,మిరియాలు నూరుతున్నారు.ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ , జానారెడ్డి సన్స్, ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు, వెంకటస్వామి కుటుంబం, కడియం శ్రీహరి కుటుంబం, మల్లు సోదరులు ఓ అరడజనుకు పైగా కుటుంబాలు ఇప్పటికే కాంగ్రెస్ లో డబల్ ధమాకా పీఠం వేసుకొని కూర్చొని ఉండగా, ఇప్పుడు ఉన్న మంత్రులు భార్యలు,పుత్రులు,పుత్రికలు రంగంలోకి దింపే అత్యాశ ప్రయత్నాలు రసకందాయంలో పడ్డాయి.అధికార పీఠం లోచూపు లోతులు కనుక్కునే పనిలో నేతలు నిమగ్నం అయ్యారు.యంపి లు , ఎంఎల్ఏ ల మధ్య కూడా ఎక్కడా సరైన సయోధ్య లేదు.ఇక గత మూడేళ్లుగా నామినేటెడ్ పదవులు ఊరడింపు,వూరింపు దశలోనే కార్యకర్తలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం తో కార్యకర్తల్లో అసహనం పెరిగిపోతోంది.ఎక్కడ చూసినా కాంగ్రెస్ లో ఏదొక లొల్లి అధిష్టానం కు తలనొప్పిగా మారింది.

ఇదిలా ఉండగా అంతర్గత కుమ్ములాటలు ఒకవైపు ముదిరి పాకాన పడుతుంటే మరోవైపు మూడేళ్ళ పాలనా ముగియ వస్తున్నా మంత్రుల శాఖల పై పట్టు లభించక పోగా అనుభవ శూన్యత కొట్టోచ్చినట్లు కనిపిస్తుంది.ఒకటి రెండు శాఖలు తప్ప ఏశాఖ పనితీరు అంత సంతుప్తికరంగా లేదు.రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి శాఖల్లో నిర్ణయాలు తీరు తొలి నుంచి వివాదాస్పదం అవుతుంది. 22ఏ సమస్యతో ఆయన వైఫల్యం స్పష్టంగా బయటపడింది.ఇక ఆర్థిక శాఖ పై అవినీతి ఆరోపణల పర్వానికి తెరపడ లేదు.ఇటీవల రిటైర్డ్ ఉద్యోగిని చేసిన బహిరంగ ఆరోపణ విస్మయానికి గురి చేస్తుంది.మరోవైపు రవాణా శాఖ లో డ్రైవర్ల ఎంపిక పైన అసంతృప్తి బయటకు వచ్చింది.కొన్ని శాఖల మంత్రులు అప్పుడప్పుడు సొంత నియోజకవర్గంలో హడావిడి చేయడం తప్ప హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు.స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ జరుపుతున్న విద్యాశాఖ లో సైతం మాటలు కోటలు దాటడం తప్ప చేతలు గడప దాటడం లేదు.హైకోర్టు అక్షింతలతో హైడ్రా సైతం సంక్షోభంలో పడింది.రైతులు ఎరువులు కొరత వెంటాడుతూనే ఉంది.మరోవైపు ఎల్ నినో ప్రభావం తో పంటలు దెబ్బతింటున్నాయి. సాగునీటి సమస్య ఎలాగూ తీర్చలేని స్థితి కి వచ్చింది.భూగర్భ జలాలు అడుగంటుతుండడం తో త్రాగునీటికి సైతం ప్రమాద సంకేతాలు ముంచుకు వస్తున్నాయి.పాలనపై పెట్టు కనపడడం లేదు.కొన్నిశాఖల్లో అధికారులే ఇష్టా రాజ్యంగా మారింది.ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ లో పదవులు కోసం,ఇంకా ఉన్నత పీఠాల కోసం రాజకీయాలు రసకందాయం లో పడినట్లు కనిపిస్తుంది.

అంతర్గత బలహీనతలు సొమ్ము చేసుకునే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య.కనుక ముసలం ముదిరి పాకానపడుతున్నట్లే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని స్థితి, మరోవైపు సగం సగం అమలు జరిపిన అసంతృప్తి, కొన్నింటిని ఆపేసుకుంటున్న స్థితి ,నిధులు కొరత ఆ పార్టీకి శాపంగా పరిణమిస్తుండ గా మరోవైపు కాంగ్రెస్ నేతల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ప్రత్యర్థులపై విసుగు, విరామం,అర్థం,పర్థం లేని మాటలు ,భాషా ప్రయోగం ఆ ఫ్రస్ట్రేషన్ నుండే పుట్టుకొస్తున్నాయి.డైవర్షన్ పాలిటిక్స్ కు కాలం చెల్లింది.పర్వర్టేషన్ వైపు పరిణామాలు మారుతున్నాయి.కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు, సంస్థలు నెగెటివ్ వోటును షేర్ చేసుకునే కనీసం వాతావరణం కనపడడం లేదు. అలాంటి ప్రయోగాలు ప్రజలు పసిగడుతున్నారు.నిరుద్యోగులు, కార్మికులు,రైతులు, ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు ఎవరూ అంత సంతృప్తికరంగా లేని స్థితి ఆ పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

కేంద్రంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పరిణామాలు సైతం రాష్ట్రం అందుకోలేక పోతుంది.అధికారపక్షంలో అంతర్గత సంక్షోభం,పాలనా వైఫల్యాలు ప్రతిపక్షాలకు ఆయాచిత వరంగా మారిపోయింది.ఒక వేళ అధిష్టానం అధికార పీఠం మార్చినా మరింత పతనం అంచులకు పరిణామాలు తీసుకెళ్ళడం తప్ప ఓరిగే ప్రయోజనం లేదు.కుదురుకునే సమయం లేదు.ఇప్పటికే ఎన్నికల వాతావరణం ముంచుకొస్తుంది.మిగిలి ఉన్న రెండేళ్ల కాలపరిమితి లో కాంగ్రెస్ ప్రజల్ని సంత్రృప్తి పరచగలిగిన స్థితి, కాంగ్రెస్ లో అంతర్గత అనిశ్చితి తొలగించడాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి.తెలంగాణలో మరొక్క మారు కాంగ్రెస్ బలహీనత ప్రతిపక్షాల కు బలం చేకూర్చే స్థితికి చేరువ అవుతోంది.ఒకవేళ అదే జరిగితే ఇక తెలంగాణ లో కాంగ్రెస్ భవితవ్యం కు నీళ్ళొదిలి నట్లే!?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *