- వరద జలాలపై ఏపీ ప్రాజక్టు ఎట్లా కడుతుంది?
- బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది
- కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల మధ్య నలిగిపోతున్న తెలంగాణ
- దిల్లీకి మూటలు మోయడం తప్ప సీఎంకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
- రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. బనకచర్ల తెలంగాణ పాలిట పెను ప్రమాదంగా మారబోతున్నది. కేంద్ర బిజేపీ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు పోతున్నదని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో బనకచర్ల ప్రాజెక్టుపై మీడియాతో ఆయన మాట్లాడుతూ అయినా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ, ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలను మీడియా సాక్షిగా ప్రజల ముందు బయట పెడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా..హెచ్చరిస్తున్నానన్నారు, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్ లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నామని స్పష్టం చేస్తూ.. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిండు. దాదాపు 20 రోజులు దాటుతున్నా వ్యతిరేకించాల్సింది పోయి మన ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వుంటూ సహకరిస్తున్నారని ఆరోపించారు.
వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ జరగదు. మన దేశంలో ఇది సిడబ్లుసీ, నదీ జలాల పంపీణీ నిబంధనలు నికర జలాల మీద డీపీఆర్ వుంటుందని గుర్తుచేశారు. వరద జలాల మీద ప్రాజెక్టు ఎలా కడుతారని కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి మౌనంగా వుండటమేంటని ప్రశ్నించారు. నీ కమీషన్ల కోసం మౌనంగా ఉంటవా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? నీ స్వార్థం చూసుకుంటావా? అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. సెప్టెంబర్ 17, 2025 నాడు కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మాకు 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని రాసింది. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం, గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి మీద నీళ్లు ఆపుతామన్నారు. మరి తెలంగాణ నష్టపోదా? కింద గోదావరి, కర్ణాటక మీద కృష్ణా నీళ్లు ఆపితే తెలంగాణ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. అంటే 423 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ అర్పణం, 112 టీఎంసీల కృష్ణా జలాలు కర్ణాటకకు అర్పణం అయితే తెలంగాణ మిగిలేదేమీ లేదన్నారు. మహారాష్ట్ర రాసిన లేఖలో అసలు ఫ్లడ్ వాటర్ మీద ముందుకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్తే మహారాష్ట్ర వాట చెప్పండి అని పేర్కొంది. వరద జలాల మీద కట్టే ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే మేము కూడా ప్రాజెక్టు కట్టేందుకు మేము కూడా డీపీఆర్లు పంపుతామన్నారు.
కృష్ణాలో 74 టీఎంసీలు మా వాటా నీళ్లు ఆపుకుంటం, వరద ప్రాజెక్టులు కడుతం విదర్భ కు నీళ్లు తీసుకుపోతం అంటున్నారు. కర్ణాటక 112 నీళ్లు ఆపుతామంటోంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి శాండ్ విచ్ లాగా తయారైందన్నారు. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్రాలు ముందుకు పోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నది మొద్దు నిద్ర పోతున్నదా? అని ప్రశ్నించారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబీ, మినిస్టరీ ఆఫ్ ఫారెస్ట్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే స్పష్టం చేసాయి. అప్పుడు తప్పు అన్న కేంద్రం ఇప్పుడు ఎందుకు ముందుకు పోతున్నది? టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం ప్రాసెస్ లో ఉందని ఎలా చెబుతుంది? సిడబ్లుసీనే వరద జలాలు ఎలా తరలిస్తారు అని రాసింది. ఈరోజు బాబు ఒత్తిడికి బిజేపీ తలొగ్గుతున్నది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీకు బాధ్యత లేదా ఏపీ మన నీళ్లు తన్నుకుపోతుంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోరు మెదపడంలేదని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లరని ప్రశ్నించారు. పోలవరంకు ఇప్పటికే డిపిఆర్ ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టంగా చెప్పింది.. అదే పోలవరంకు బనకచర్ల పేరిట అడ్డగోలుగా కాల్వలు పెంచితే కేంద్రం మౌనం ఎందుకు? నిన్న ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం 9 కోట్లకు టెండర్లు పిలిచింది. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటు. టెండర్ బిడ్ డాక్యుమెంట్ లో పేజీ 79లో ఉన్న దాని ప్రకారం, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23వేల క్యూసెక్కులు మళ్లించేలా రూపకల్పన చేసారు. నిజానికి11,500 క్యూసెక్కులు మాత్రమే దాని కెపాసిటీ. ఇప్పుడు డబుల్ కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతున్నారు. అంటే కేంద్రం ఏం చేస్తున్నది? బిజేపీ రాష్ట్రానికి ఒక నీతి ఉంటదా? నిబంధనలు ఉల్లంఘించి తవ్వుతుంటే బిజేపీ ఎందుకు నిధులు యిస్తున్నదని ప్రశ్నించారు. ఆనాడు కెనాల్ ను 18వేలకు పెంచితేనే బిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది. కొట్లాడింది. కేంద్రం డబ్బులు ఆపింది. రేవంత్ వచ్చాక ఇప్పుడు కెనాల్ 18వేల నుంచి 23వేల క్యూసెక్కులకు పెంచుతున్నది. పరోక్షంగా రేవంతు సహకరిస్తున్నడని ఆరోపించారు. బిజేపీ, ఏపీ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా వుండటమేంటని ప్రశ్నించారు. న్యాయవాదులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. నువ్వు సుప్రీం కోర్టుకు వెళ్లకున్నా బిఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లి హక్కులను కాపాడుతుందన్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు ఇంత వేగంగా పనులు చేస్తుంటే రేవంతు సైలెంట్ మోడ్ లో వుండటమేంటని ప్రశ్నించారు.
వరద జలాల మాట దేవుడెరుగు, ఉన్న నీళ్లు పోయేటట్టు ఉన్నయి. అపెక్స్ మీటింగ్ కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని మేం ఆనాడు హెచ్చరించినం. పోను అనుకుంటూనే ఢిల్లీకి పోయి మీటింగ్ లో కూర్చున్నడు. బయటకు వచ్చి బనకచర్ల ప్రాజెక్టు అంశం మీటింగ్ ఎజెండాలోనే లేదని, కనుక చర్చే జరగలేదని బుకాయించి, రాష్ట్ర ప్రజలను మోసం చేసిండు. కానీ ఎజెండాలో బనకచర్ల అంశం ఉందని బిఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అసలు సంగతి బయట పెట్టిండు. దీంతో రేవంతు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డది. చేసిన ద్రోహం.. బట్టబయలైంది. కమిటీ ఒప్పుకోవడం అంటేనే బనకచర్లకు ఒప్పుకోవడం. బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు గంగిరెద్దులాగ తలూపిండు. లేఖలు అబద్దమా, మహారాష్ట్ర, కర్ణాటక రాసిన లేఖలు అబద్దమా? కేంద్రం నుంచి 20 రోజులుగా ఉత్తరం వస్తే ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. ఆల్మట్టి ఎత్తు పెంపు పై మౌనం.. మొన్న కర్ణాటకకు పోయినవు కదా? పోయి ఏం చేసినవు. ఆల్మట్టి మరిచినవు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంట వచ్చినవు. కర్ణాటకలో ఉన్నది మీ పార్టే కదా, మీ సిద్దారామయ్యే కదా, మీ శివ కుమారే కదా ఖర్గే తోని ఒక ఫోన్ చేయించకపోతివి. ఆల్ మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారి అయితదని ఒక మాట చెప్పించకపోతివి. పోనీ ఖర్గే గారి ఆరోగ్యం బాగా లేదనుకుంటే నువ్వే పోయి ముఖ్యమంత్రినో, ఉప ముఖ్యమంత్రినో కల్వనుంటివి. ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని ఒక మాట చెప్పాలి కదా, కానీ ఆ వూసే ఎత్తలేదన్నారు. ఎప్పుడూ ఢిల్లీకి బ్యాగులు మోసుడే కాదు, అప్పుడప్పుడు ప్రజల బాగోగులు కూడా మొయ్యమని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ది కాదు, అసలు చిత్తమే లేదు. ఆయనకు బేసిన్లు తెల్వదు, బేసిక్సు తెల్వదు అనేది అందరికి తెలిసిన విషయమే. అటువంటి రేవంత్ రెడ్డికి నీటి వాటాల గురించి తెలిసే అవకాశం అంతకంటే లేదు. ఒకసారి కృష్ణాలో మాకు 500 టీఎంసీలు ఇచ్చి నువ్వు ఏమన్నా చేసుకో అని చంద్రబాబుకు ఓపెన్ ఆఫర్ ఇస్తడు. ఇంకోసారి 904 టీఎంసీల కోసం కొట్లాడుతున్నా అంటడు. ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు అంటడు. కేసీఆర్ 9 ఏండ్లు పోరాడి, తండ్లాడి సుప్రీం మెట్లు ఎక్కి ట్రిబ్యునల్ సాధించారు. ఏపీ తెలంగాణ మధ్య దాని ప్రకారమే నీళ్ల పంపిణీ జరగాలని కోరారు. మా ప్రభుత్వం ఉన్నపుడే వాదనలు సగం అయినయి. రేవంతు మాత్రం చంద్రబాబుకు తెలంగాణ నీళ్లు ఆఫర్ ఇస్తున్నడు. నువ్వు ఎవరు రేవంత్ రెడ్డి.. తెలంగాణ నీటి హక్కులు చంద్రబాబుకు దారాదత్తం చేయడానికి? ముఖ్యమంత్రికి మూటలు తప్ప ఇంకోటి తెల్వదు. మంత్రులకైనా సోయి ఉందా. గోదావరి, కృష్ణా నదీ జలాల వాటాలో తెలంగాణకు శాశ్వత ద్రోహం జరుగుతుంటే కాంగ్రెస్ మాట్లాడటం లేదు. మేధావులు ఆలోచాంచాలని కోరుతున్నా. బనకచర్ల అప్రైజల్ కు ఎట్ల వస్తది, కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఎట్ల స్వీకరిస్తది. తెలంగాణ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతున్నది బనకచర్ల విషయంలో ముందు అప్రమత్తం చేసింది బిఆర్ఎస్. ఆల్మట్టి ఎత్తు పెంచితే బిఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ కాదు. గోదావరి నీళ్లు మళ్లిస్తుంటే బిఆర్ఎస్ ప్రవ్నిస్తుంది తప్ప కాంగ్రెస్ కాదు. రాజ్యాంగాన్ని, నియమ నిబంధనలను కాపాడాల్సిన బిజేపీ కళ్లు మూసుకొని ఉంటున్నది. రేవంత్ …స్పందించు అప్రైజల్ ఆగాలి. డీపీఆర్ ఆగాలి. కేంద్రం వినకుంటే సుప్రీంలో పోరాడు. రాష్ట్రం హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. నేను చేసే విన్నపం ఒకటే.. తెలంగాణ హక్కులను కాపాడేది ఒక్క కేసీఆరే, బిఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ లేకుంటే తెలంగాణను అగాధం చేస్తరు, అనాథగా మార్చుతరు. మన నీటి హక్కులను కాపాడుకోవాలంటే బిఆర్ఎస్ ను కాపాడుకోవాలన్నారు.





