ప్రవాస తెలంగానం
కన్నోళ్లను, ఐనోళ్లను, పుట్టి పెరిగిన ఊరిని, అన్నిటినీ వదిలి వలస వెళ్లడమంటే నాదృష్టిలో గుండెను ఇంటి చూరుకు వేలాడదీసి ఒట్టి దేహంతో పొలిమేరను దాటడంలాంటిది. అలా నేను ఊరు విడిచి ఇప్పటికి పన్నెండు వసంతాలు. ఈ పుష్కరకాలంలో మస్కట్ నుంచి మాస్కో వరకూ, మండే ఎండల్లోంచి మంచు కొండలదాకా, రియాల్ కూ రూబెల్ కూ మధ్య నలుగుతున్న నా ఈ వలస జీవితంలోకి సాహిత్యం రావడం యాదృచ్చికం. సాహిత్యమే జీవితమవడం అనూహ్యం.
నిజానికి నా అనేవాళ్ళు లేని ఈ వలస ప్రయాణమే నన్ను సాహిత్యం వైపు ఆకర్షించింది. కవిత్వం రాయడం, చదవడం నా ఒంటరి బ్రతుకుకు ఊరటలా అనిపించేది. అరకొర జీతాలతో సర్దుకుంటూ, ఉండటానికి మనసొప్పక, పోవడానికి ధైర్యం చాలక సతమతమవుతున్న తోటి వలస బ్రతుకుల కన్నీళ్లను కలంలోకి ఒంపాలనే తలంపుతోనే నా సాహిత్య ప్రస్థానం మొదలైంది.
ఇంటి దిగులు వెంటాడుతున్న రోజుల్లో నా ఎడబాటును అక్షరాలుగా మలిచి ‘గల్ఫ్ బ్రతుకులు’ అనే తొలి వలస కవితను నా చేత రాయించిన నాంపల్లి సుజాతమ్మను, నన్ను నేను పుస్తకంగా చూసుకుని మురిసిపోయే ఆనంద క్షణాలను అందించి, నాకెళ్ళప్పుడూ తోడుగా నిలిచిన కవి సంగమం వ్యవస్థాపకులు, గురువులు కవి యాకుబ్ గారిని ఈ సమయంలో తలచుకుంటున్నాను. నా సాహిత్య ప్రయాణంలో ఈ ఇద్దరి పాత్రను నేనెప్పటికీ మరవలేను. నేను సాహిత్యంలోకి అడుగిడిన తొలినాళ్ళనుండి ఇయ్యాల్టిదాంకా, “వేల మైళ్ళ దూరానున్నవ్ తమ్ముడా యాల్లకింత తిను, మంచిగుండు, ఇంటి రంది వెట్టుకోకు” అంటూ నిత్యం నన్ను పలకరిస్తూ యోగక్షేమాలను అరుసుకున్న సాహితీ మిత్రులు, అన్నలను యాది చేసుకోని సందర్బమంటూ ఉండదు, ఈ సందర్బంగా వారందరికీ నెనరులు.
వలస నేపథ్యంలోంచి రాసిన ‘అమ్మీజాన్’, ‘పంచరంగుల పంజరం’, ‘సిద్దిపేట్ టూ మస్కట్ వయా హైదరాబాద్’, ‘వలస శవం’, ‘ఊరి యాది’, ‘గల్ఫ్ బ్రతుకులు’, ‘వలస వేదన’ అనే కవితలు నాకెంతో పేరు తెచ్చిపెట్టడమే కాదు, వలస కార్మికుల దీనస్థితిని లోకానికి చూపి కొన్ని మనసులనైనా కదిలించగలిగాననే సంతృప్తిని మిగిల్చాయి. అలాగే నేను రాసిన ‘గల్ఫ్ చెరసాలలో వలస జీవులు’ అనే ఆర్టికల్ చదివి అపరిచితులైన వలస మిత్రులు కొందరు తడికళ్ళతో వారి అనుభవాల్ని ఫోన్లో పంచుకున్న జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి.
ఇప్పటివరకూ ఎడారి గోసల్ని కవిత్వంగా మలిచగలిగాను. ఇప్పుడు రష్యాలో ప్రవాస భారతీయులకు ఎదురవుతున్న చేదు అనుభవాలపై రాసేందుకు ప్రయత్నిస్తున్నాను. అలా వలస నా రచనల్లోకి ప్రవేశించే క్రమంలో పూర్తి స్థాయిలో వ్యధల్ని రికార్డ్ చేయగలిగానో లేదో తెలియదు కానీ, రాయక ఉండలేని ప్రతి సందర్భాన్ని కవిత్వంగా మలిచేందుకు ప్రయత్నించానని మాత్రం చెప్పగలను.
ఎక్కడో విన్నట్టు గుర్తు, ఏ భాషలో మాట్లాడినా మెదడుకు చేరుతుందంటారు, కానీ మాతృభాషలో మాట్లాడితే అది నేరుగా మనసును తాకుతుంది, పుట్టి పెరిగిన పరిసరాల ప్రభావం వల్లనేమో నా మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలంగాణ యాసతో కూడిన తెలుగంటేనే నాకు మహా ఇష్టం. అలా నేనెంతో ఇష్టపడే మాతృభాషలాంటి తెలంగాణ యాస అవమానానికి గురవుతున్న కాలమది, 2009 చివర్లో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణం, నేనప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సాహిత్యం మనిషినెట్లా కదిలిస్తుందో ప్రత్యక్షంగా అనుభవించిన రోజులవి. చిన్నా, పెద్ద ప్రతీ ఒక్కరినీ గజ్జెకట్టి కదం తొక్కేలా ప్రేరేపించిన ఉద్యమ సాహిత్యపు సువర్ణ కాలం. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించేందుకు, అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడంలో అప్పటి పాటలు ప్రముఖ పాత్ర వహించాయి.
సకల జనుల సమ్మె, అర్థనగ్న ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు ఇట్లా ఉద్యమం రూపు మార్చుకుని మహోధృత స్థాయికి వెళ్ళిన ప్రతిదశలోనూ సాహిత్యం జనాల్ని జాగృతపరిచింది, అలా అప్పటి సాహిత్యానికి ఉత్తేజితులైనవాళ్ళల్లో నేనూ ఒకడిని. నా కౌమార దశలో అప్పటి సాహిత్య ప్రభావానికి లోనై ఉద్యమ కవితలు ‘నీ నా కల’, ‘అభినవ రాజకీయం’, ‘పట్టు విడవకు ఆశ వదలకు’ లాంటివి రాసిన సందర్భాలు ఇంకా గుర్తున్నాయి. కానీ పూర్తిస్థాయి సాహిత్యంలోకి అడుగుపెట్టింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం కాబట్టి ఆ తర్వాత రాసిన ‘నా తెలంగాణ’, ‘తంగేడు’ వంటి కవితలు నన్ను ప్రత్యేకంగా నిలబెట్టగలిగాయి. ఒక ప్రాంతపు ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సామాజిక పరిస్థితుల నుంచి ఆ భాషలో ఉండే వైవిధ్యత సజీవంగా ఉద్భవిస్తుంది. నా తొలి కవితా సంపుటి ‘అగరుధూపం, ఊదుపొగ’లోని ప్రత్యేకించి కొన్నిరచనల్లో తెలంగాణ భాష అలా అసంకల్పితంగానే ఉద్భవించిందని నమ్ముతాను.
తెలంగాణ మలిదశ పోరాటానికి విద్యార్థులే ఊపిరి, ఆ విద్యార్థుల్ని నడిపించింది మాత్రం ఉద్యమ సాహిత్యమే. ఆశ, అసహనం, నిరీక్షణ, పట్టు విడవనితనం ఇట్లా అప్పటి ప్రతీ భావోద్వేగానికి తెలంగాణ ఉద్యమపాటలు ఆలంబనయ్యాయి. నిజానికి ఆ ఉద్యమస్ఫూర్తి అప్పటి కాలానికి మాత్రమే పరిమితమైనదని అనుకోను. నా వ్యక్తిగత జీవితపు ప్రతి సందర్భంలోనూ అణచివేతపై తిరగబడాల్సిన ప్రతి తరుణంలోనూ పోరాడేలా రాటుదేల్చింది ఆ కాలమేనని నా భావన.
జాబేర్ పాషా





