•పలు జిల్లాల్లో దెబ్బతిన్న మక్క, మామిడి పంటలు
•ఆందోళనలో పంట నష్టపోయిన రైతులు
నిజామాబాద్ : వడగళ్లతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల వరి, మక్క పంటలు దెబ్బతినగా చేతికొచ్చిన మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు నిర్దారణకు వొచ్చారు. మరో రెండు మూడు రోజుల పాటు పంట నష్టం సర్వే పనులు కొనసాగించనున్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై గ్రామాల వారీగా సమగ్రంగా సర్వే చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఇప్పటికే ఆదేశించారు. రైతుకు నష్టం జరిగిన నివేదికలో సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో 519 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది.
నిజామాబాద్ జిల్లాలో బోధన్, రూరల్ నియోజకవర్గాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో పంటలకు నష్టం జరిగింది. బలమైన గాలులకు ధాన్యం గింజలు నేలరాలాయి. నిన్నమొన్నటి వరకూ సాగునీటి కష్టాలను తట్టుకుని పంటలను కాపాడుకున్న రైతుల ఆశలపై ఆకాల వర్షం దెబ్బతీసింది. అకాల వర్షం ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. బోధన్, కోటగిరి, పోతంగల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పంట నష్టం సంభవించింది. కామారెడ్డి జిల్లాలో 25 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్లు గుర్తించారు. గాంధారి మండలం రాంలఁ్‌మన్పల్లి, మాత్సంగెం, భిక్కనూరు మండలం అంతంపల్లి, రామేశ్వరపల్లి శివారు, సదాశివనగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి శివార్లలో మక్క పంట నెలకొరిగింది.
దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల్లో కొద్ది పాటి వర్షం పడగా, రాజంపేటలో వడగండ్లు పడ్డాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 350 ఎకరాల్లో పంటనష్టంతో రైతులు ఆర్ధికంగా దెబ్బతిన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 598 ఎకరాల్లో జరిగిన నష్టం వల్ల 279 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు వెల్లడిరచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 336 ఎకరాల్లో జరిగిన పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు- అధికారులు తెలిపారు. జిల్లాలో దాదాపు 135 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 78 ఎకరాల్లో జొన్న, 28.2 ఎకరాల్లో మామిడి, 18 ఎకరాల మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన పంటనష్టం వివరాలపై అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు.