‌బానిస… బానిసలకింత అహంభావమా..!

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌గా ‘గులాంగిరి’ వ్యాఖ్యలు..
(మండువ రవీందర్‌రావు)
‘బానిస… బానిసలకింత అహంభావమా..!’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా! అవును అచ్చంగా ఇది సినిమా డైలాగే. జూదంలో ఓడిపోయిన పాండవులు సుయోధనుని సూటిపోటి మాటలను ధిక్కరించిన క్రమంలో దుర్యోదనుడితో పై విధంగా డైలాగ్‌ ‌చెప్పించాడు సినిమా డైరెక్టర్‌. ‌నిజంగానే ఆ డైలాగ్‌ ఆ ‌రోజుల్లో హిట్‌ అయింది కూడా. ఇప్పుడీ డైలాగ్‌ ‌తెలంగాణ రాజకీయాల్లో పాపులర్‌ అవుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఇటీవల ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలే చేసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్నారన్న ఆవేదన, ఆక్రోశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న క్రమంలో బానిస లేదా గులామ్‌గిరి చేస్తున్నారన్న మాటలను తరచూ వినిపిస్తున్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నాడంటూ ఇటీవల కేంద్ర కోల్‌, ‌మైన్స్ ‌శాఖ మంత్రి గంగవరపు కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.. ఆయనను గుజరాత్‌ ‌గులామ్‌ అం‌టూ ఎద్దేవా చేయడం, దానిపై కిషన్‌రెడ్డి స్పందించడంతో ఎవరు ఎవరికి గులాంగిరి చేస్తున్నారన్న విషయంపై మాటల తూటాలు పేలుతున్నాయి.

దేశమంతా గుజరాత్‌ ‌మోడల్‌ ‌కావాలంటున్న బిజెపికి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఇష్టపడడం లేదన్నది కాంగ్రెస్‌ ‌వాదన. గంగా, సబర్మతి ప్రక్షాళనపై బిజెపి సంబరాలు చేసుకుంటున్నది. ఆ సంబరాలకు సుమారు యాభై వేల మందిని గుజరాత్‌కు తరలించి చప్పట్లు కొట్టిచ్చిన కిషన్‌రెడ్డి, స్వంత రాష్ట్రంలో మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించడంపై సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తెలంగాణ పట్ల మొదటి నుంచి న్యూనతాభావంతో ఉంటున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంటు  సమావేశాల సందర్భంగా, బహిరంగ సభల్లో తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడుతున్న తీరు ఆయన అయిష్టాన్ని తెలియజేస్తున్నదంటున్న రేవంత్‌రెడ్డి.. అలాంటి వ్యక్తికి కిషన్‌రెడ్డి బానిస ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వరంగల్‌ ‌సభలో కూడా ఆయన ఈ విషయాన్నే ప్రస్తావించారు.

పార్లమెంటు తలుపులు బంధించి, దుర్మార్గంగా ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ను సోనియా విభజించిందని, తల్లిని చంపి బిడ్డను బతికించిందంటూ అపహాస్యం చేసిన మోదీకి కిషన్‌రెడ్డి బానిసగా మారాడని, అలాంటి వ్యక్తికి తెలంగాణలో ఉండే అర్హత లేదని, గుజరాత్‌కు పోవాలంటూ తీవ్రంగా విమర్శనాస్త్రాలను సందించారు. అయితే అదే రీతిలో కిషన్‌రెడ్డి కూడా స్పందించడంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడిరాచుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ‘బానిస, గులామ్‌లన్న పదాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నట్లు తాను నిజంగానే గుజరాత్‌కు బానిసనేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమర్థించుకోవడం ఆసక్తిగా మారింది. వాస్తవంగా తాను భారతదేశానికే బానిసనని చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీకి బానిసను, ఆ తర్వాత ‘నా తెలంగాణ రాష్ట్రానికి నిజాం రాజు నుంచి విముక్తిని కలిగించిన సర్ధార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌గుజరాత్‌ ‌వాడు కావడం వల్ల తాను గుజరాత్‌కు బానిసనని’ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈదేశంలోని 25 కోట్ల నిరుపేదలను పేదరికం నుంచి కాపాడిన ప్రధాని నరేంద్రమోదీకి కూడా తాను బానిసనేనన్నారు. అయితే నకిలీ గాంధీ కుటుంబానికి మాత్రం తాను ఎట్టి పరిస్థితిలో గులాంను కాదంటూ రేవంత్‌రెడ్డి మాటలకు ఘాటైన జవాబివ్వడంతో అధికార ప్రతిపక్షల మాటలు రసకందాయంలో పడ్డాయి.

అలాగే మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి చెప్పిన గొప్పలన్నీ అబద్దాలేంటూ కిషన్‌రెడ్డి ఎత్తిచూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామన్న మాట నేటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలుపుకోలేక పోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడంకాదా అంటున్న కిషన్‌రెడ్డి, గతంలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్‌ అమలుపరుస్తున్నదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు అద్వాన్నంగా మారాయని, వ్యక్తిగత ధూషణలతో ఏమాత్రం నైతిక విలువలను పాటించకుండా రాజకీయాలను దిగజారుస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాగా, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో, ప్రభుత్వంపై వొత్తిడి తేవడంతోపాటు, అధికారపార్టీ వైఫల్యాలను ఎండగట్టడుతూ డిసెంబర్‌ ఒకటి నుంచి అయిదు రోజులపాటు పాదయాత్రలకు బిజెపి సిద్దపడింది.  బిఆర్‌ఎస్‌కూడా తక్కువేమీ తినలేదు. అసలు ఈ దిల్లీ గులాములెవరూ మనకొద్దంటున్నారు. వీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమన్నది ఆ పార్టీ నాయకులు ఆవేదన. దిల్లీకి సలాములు కొట్టే గులామ్‌లు మనకొద్దు.. గులాబీ ముద్దు, కాంగ్రెస్‌-‌బిజెపిని రద్దు చేద్దాం అంటూ ఇటీవల ఆర్మూర్‌ ‌మాజీ ఎంఎల్‌ఏ, ‌నిజామాబాద్‌ ‌బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపునివ్వడం ఇందులో కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page