– స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
న్యూదిల్లీ, అక్టోబరు 7 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై అడ్డంకులు తొలిగాయి. దీనిపైస్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఊరట లభించింది.హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా.. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిచడంపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్జిల ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడంపైనా అభ్యర్ధుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వాదనల అనంతరం.. స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్లన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఈనెల 15న విచారణకు రానున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈలోగా చేపట్టిన నియామకాలన్నీ.. రిట్ అప్పీల్స్‌పై ఇచ్చే ఫలితానికి లోబడి ఉంటాయని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. అవకాశం ఉన్నంత త్వరగా పిటిషన్లపై విచారణ ముగించి తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసుకు ప్రాధాన్యత ఇచ్చి విచారణ పూర్తి చేయాలని సూచిస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను ధర్మాసనం ముగించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





