ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేయాలి

క‌నుగోళ్ల వివరాలు న‌మోదు చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మహబూబ్‌న‌గర్ ప్రజాతంత్ర  నవంబర్ 29  : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి కేంద్రాల నుంచి తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ  వంద‌శాతం పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి తో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే శనివారం లోపు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి చెల్లింపులు చేయాలన్నారు.

అదేవిధంగా ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలకు వొచ్చిన ధాన్యాన్ని నూటికి నూరు శాతం కేంద్రాల నుంచి తరలించాలని చెప్పారు. సన్న ధాన్యాన్ని ప్రోత్సహించాలని, రేషన్ కార్డుదారులందరికీ సన్నధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించవలసి ఉందని తెలిపారు . అలాగే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు చెల్లింపులు సైతం జాప్యం లేకుండా  చేయాలని చెప్పారు. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎక్కువగా ఉందని, తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాల్సిన అవసరం ఉందని, అదే విధంగా చెల్లింపులు కూడా వెంటనే  చేయాలని చెప్పారు. మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకోవాల‌ని,  ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు, బోనస్ కన్నా ఒక రూపాయి తక్కువకు కొనుగోలు చేయకుండా నియంత్రించాల‌ని ఆదేశించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శనివారం లోపు పెండింగ్ లో ఉన్న రైతులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లింపులు చేయాలని, అలాగే ట్యాబ్ ఎంట్రీ సైతం పూర్తి చేయాలని చెప్పారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెంటనే తరలించడం తో పాటు, చెల్లింపులు సైతం త్వరగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.   మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని అన్నారు.  దేవరకద్ర  ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సన్నధాన్యం అమ్మిన  రైతులకు బోనస్ ఎక్కువగా పెండింగ్ లో ఉందని, త్వరగా చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అంతకుముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌న‌గర్ జిల్లాలో ఈ వానాకాలం ఇప్పటివరకు సన్న రకం, దొడ్డు రకం కలిపి రూ.333 కోట్ల విలువచేసే 126154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 18383 మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు.

రైతులకు ఇప్పటి వరకు 216.78 కోట్ల రూపాయలు చెల్లించగా, ఇందులో 8.75 కోట్లను సన్న ధాన్యానికి బోనస్ చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లాలో ధాన్యం సేకరణ అన్ని జిల్లాల కన్నా బాగుందని, ప్రత్యేకించి సన్నధాన్యం సేకరణ సైతం పాల‌మూరు జిల్లాలో బాగుందని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొనుగోళ్లు, చెల్లింపులు సైతం బాగున్నప్పటికీ చెల్లింపుల విషయంలో ఇంకా త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కసి రెడ్డి నారాయణరెడ్డి, మేఘా రెడ్డి, ఫర్నికా రెడ్డి, అనిరుద్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, డాక్టర్ వంశీకృష్ణ, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తోపాటు, రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page