100 రోజులలో ఆరువేల కోట్లు చెల్లింపు అమలయ్యేనా?

“ఈ 6000 కోట్లు కూడా 1000 కోట్లు చెల్లించామని ఏ విధంగా ప్రకటించుకున్నారో అదే మాదిరి కాకూడదు. ఒక ప్రణాళిక రూపొందించుకొని, ఆ కమిటీలోకి బాధిత పెన్షనర్ల సంఘ బాధ్యులను తీసుకొని, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పారదర్శకంగా ఎలాంటి పైరవీలు లేకుండా, కమీషన్లు లేకుండా ముందు రిటైర్డ్ అయిన వారికి ముందుగా, బిల్లులన్నింటిని ఏక మొత్తంలో చెల్లించి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొని,ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాలి..”
రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు 
-కందుకూరి దేవదాసు
రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు*.
మొబైల్:9949937745

అయ్యా ముఖ్యమంత్రి గారు!

ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం.. ప్రభుత్వ పాలన సక్రమంగా నిర్వహించబడాలంటే  ఉద్యోగుల పాత్ర ఎంతగానో ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యా, వైద్యం కానీ, రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో పథకాలు, ప్రజలకు సక్రమంగా అందాలంటే ఉద్యోగులు నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుంది. సక్రమంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తదనుగుణంగా ఉద్యోగులకు సకాలంలో చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, ఉద్యోగుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా, నిత్యవసర ధరల పెరుగుదల,ధరల సూచీకనుగుణంగా ఉద్యోగులకు, ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డి.ఎ. కరువు భత్యం చెల్లించాల్సి ఉంటుంది.
        అయ్యా! ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల కారణంగా .. బిఆర్ఎస్ ప్రభుత్వం  ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మీరిచ్చిన హామీల పట్ల విశ్వాసంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు మీ పార్టీకి సానుకూలంగా ఉండడం వల్లనే మీరు అధికారంలోకి రాగలిగినారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల వోట్లే కీలకమైనవి” అనేది బహిరంగ రహస్యం. మీరు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది. ఇంతకాలం ఓపిక పట్టాం.
మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, మీరు అధికారంలోకి వచ్చే ముందు అప్పుల తెలంగాణ అని తెలిసి, మీరు అమలు కానీ హామీలను ఇచ్చి ఈరోజు మీరు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల విశ్వాసాన్ని రెండున్నర సంవత్సరాల వ్యవధిలో కోల్పోతున్న క్రమంలో ఉద్యోగ జేఏసీ 2025 మే నెలలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తే,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి, మీరు మాట్లాడాల్సినటువంటి మాటలు కావు.మీ హుందాతనానికి ఈ మాటలు సరియైనవి కావు. డబ్బులు లేవు అంటూనే మూసి సుందరీ కరణకు లక్ష యాభై వేల కోట్లు, గాంధీ విగ్రహానికి 5000 కోట్లు, ప్రపంచ సుందరీమణుల పోటీలు, మెస్సి ఫుట్బాల్ పోటీలు, గ్లోబల్ సమ్మిటు, ఫోర్త్ సిటీ డెవలప్మెంట్, ఎన్నికల వాగ్దానాలలో భాగంగా కాలేజీ విద్యార్థినిలకు ఇ.వి. స్కూటీలు మరియు కొన్ని అనవసర పథకాలకు మీ రాజకీయ లబ్ధి కొరకు ఉచిత పథకాలను కొనసాగించుకుంటూ కోట్ల కొలది ప్రజాధనాన్ని దుబారా ఖర్చులను చేస్తూ  వీటన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. లక్షలకొలది అప్పులు తెస్తున్నారు! కానీ రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఎందుకు లేవంటున్నారు?. ఇది భావ్యం కాదు. మిమ్ములను, మేము ఉచితంగా ఇవ్వమని అడగడం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వమని అంటున్నాం.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. “మీరు అధికారంలోకి వస్తే మీరు చేస్తానన్న హామీలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి”. వాటిలో కేవలం ఒకే ఒక్క హామీ మాత్రమే నెరవేరినది. అది ఉద్యోగులకు ఒకటవ తారీఖున వేతనాలు మాత్రం చెల్లిస్తున్నారు. దానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
      కానీ మిగతా హామీల సంగతి ఏమిటి? ప్రస్తుతం 2026 లో టీజీఇజేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి గత నెల 17వ తేదీన నిరసన ప్రదర్శన చేసిన తదనంతరం మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షల కార్యక్రమం ప్రకటించిన తర్వాత ఆ ఉద్యమ కార్యక్రమాన్ని మీరు నీరుగార్చేందుకు, ఉద్యమాలు చేయకూడదు అనే రాజకీయ ఎత్తుగడతో  మీరు మే 2 న ఉద్యోగుల జేఏసీతో చర్చల సందర్భంగా మళ్లీ కొత్తగా రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు 100 రోజులలో 6000 కోట్లు చెల్లింపు, పి.ఆర్.సి. రిపోర్టు తక్షణమే తెప్పించుట, ఉద్యోగుల, పెన్షనర్ల హెల్త్ కార్డులు జూన్ 1 నుండి అమలుపరచుట, ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తో సమావేశము నిర్వహించుట అనే నాలుగు హామీలను మళ్లీ ఇచ్చి, మే 5న జరిగే నిరాహార దీక్షలను రద్దు చేయించి ప్రభుత్వము ఘనవిజయం సాధించి, పెన్షనర్లను, ఉద్యోగులను నిరాశకు గురిచేసింది.
అయ్యా! ముఖ్యమంత్రి గారు
ఇప్పుడు 6000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలని వంద రోజులలో చెల్లిస్తామని అంటున్నారు కానీ 15 రోజుల క్రితమే మంత్రుల కమిటీ చెప్పడం జరిగినది. మీరు ఇప్పుడు మళ్ళీ వంద రోజులు అని అంటున్నారు ఎప్పుడు చూసినా వంద రోజులే అవుతుందా? ఏప్రిల్ 2026 లో 1000 కోట్లు పెండింగ్ బిల్లులు క్రింద చెల్లించామని చెప్పారు కదా! ఆ వెయ్యి కోట్లు ఎవరెవరికి చెల్లించారు? రిటైర్డ్ ఉద్యోగుల జిపిఎఫ్ అక్టోబర్ 2025 వరకు జిపిఎఫ్ చెక్కు అయినవారికి చెల్లించామని మీరు చెప్పుకుంటున్నారు కదా! కానీ అక్టోబర్ 2025 వరకు జడ్పీ జిపిఎఫ్ చెక్కు ఎస్.టి.ఓ.లో సబ్మిట్ చేసిన వారికి ఎవరికి కూడా రాలేదు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసుకోకండి. అబద్దాలతో కాలం వెళ్ళబుచ్చకండి. రిటైర్డ్  ఉద్యోగులను మోసం చేయకండి.
రిటైర్డ్ ఉద్యోగులు వారు దాచుకున్న జిపిఎఫ్ డబ్బులు కూడా వారికి రెండు సంవత్సరాలైనా చెల్లించకపోవడం దారుణం, శోషనీయం. 1000 కోట్లలో సర్వీసులో ఉన్న వారికి 500 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు 500 కోట్లు అని ప్రకటించారు. కానీ దానిలో కేవలం గవర్నమెంట్ జిపిఎఫ్ ఉన్నవారికి కొంతమందికి మాత్రమే చెల్లించి, సర్వీసులో ఉన్న వారి సరెండర్ లీవులు, మరియు కాంట్రాక్టర్లకు మాత్రమే వాటిని చెల్లించారు. జెడ్పి జిపిఎఫ్ ఉన్నవారికి అక్టోబర్ 2025 వరకు చెల్లించకపోవడం అన్యాయం. మీరు ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు అక్టోబర్ 2025 వరకు జిపిఎఫ్ చెల్లించామని ప్రకటించుకున్నారు ఆ విధంగా ప్రకటించడం సరైన విధానం కాదు, తప్పుడు ప్రచారాలు మానుకోండి. 1000కోట్లకు సంబంధించి మీరు ఎవరెవరికి ఎంత అమౌంట్ చెల్లించారో ఒక శ్వేత పత్రం విడుదల చేసి, ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాలని  రిటైర్డ్ ఎంప్లాయిస్ రాష్ట్ర శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.
       అదేవిధంగా మీరు 100 రోజులలో 6000 కోట్లు చెల్లిస్తాం అనే దానిని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ పక్షాన ఆవేదనతో వ్యతిరేకిస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజులలో 6000 కోట్లు చెల్లిస్తాం అంటున్నారు.  రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు 100 రోజులలో (మూడు నెలల వ్యవధిలో) నెలకు 2000 కోట్ల చొప్పున 6000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. “ఈ 6000 కోట్లు కూడా 1000 కోట్లు చెల్లించామని ఏ విధంగా ప్రకటించుకున్నారో అదే మాదిరి కాకూడదు. ఒక ప్రణాళిక రూపొందించుకొని, ఆ కమిటీలోకి బాధిత పెన్షనర్ల సంఘ బాధ్యులను తీసుకొని, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పారదర్శకంగా ఎలాంటి పైరవీలు లేకుండా, కమీషన్లు లేకుండా ముందు రిటైర్డ్ అయిన వారికి ముందుగా, బిల్లులన్నింటిని ఏక మొత్తంలో చెల్లించి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొని,ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాలి..”  ఇక హామీల విషయం పరిశీలించినట్లయితే మీరు అధికారంలోకి వస్తే, ఒకేసారి అప్పుడు బకాయి పడి ఉన్న మూడు విడతల డీ.ఏ.లను వెంటనే చెల్లిస్తామన్నారు కానీ చెల్లించలేదు. అవి ఇప్పటికి ఐదు విడతల డి.ఎ.లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పీఆర్సి రిపోర్టు తెప్పించుకోలేదు ఇప్పటికీ అమలు చేయలేదు. ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. నగదు రహిత హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్స్ లలో అమలయ్యే విధంగా విడుదల చేస్తామన్నారు ఇంతవరకు విడుదల చేయలేదు.
ఇది ఉద్యోగులను వంచించడం కాదా? 
          అయ్యా! ముఖ్యమంత్రి గారు! మీరు ఇచ్చిన హామీలు ఈ విధంగా ఉన్నప్పటికీ ఏవి కూడా అమలు చేయలేకపోయారు. అయినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగులను మోసగించిన విధంగా మీరు కూడా మోసగించే స్థితిలో ఉన్నారని అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి గత హామీలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం మీరు ఇప్పుడు మే రెండవ తేదీన ఇచ్చిన హామీలనైనా అమలు పరిచే దిశగా, ప్రభుత్వము ముఖ్యంగా  ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 22,000 మందిలో బకాయిలు రాని దాదాపు 18000 మంది కుటుంబాలను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెన్షనర్ల, ఉద్యోగుల విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని పొందాలని  ఆకాంక్షిస్తున్నాము.
18,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రావలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఇ.ఎల్. హాప్-పే లీవ్ ఇన్కాష్మెంట్ లీవ్స్, జిపిఎఫ్, జిఐఎస్, పీఆర్సి ఏరియర్స్ తదితర బిల్లుల మొత్తం రిటైర్ అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉన్నది.   మాకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు 25 నెలల కాలంగా చెల్లించకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు మానసిక వేదనతో, అప్పులు తీర్చలేక, అనారోగ్యం పాలై, మానసికంగా కృంగిపోయి చనిపోవడం జరిగినది. ఇంతమంది పెన్షనర్లు చనిపోతున్నా వారి మీద మీకు దయ,జాలి, కనికరం ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు.
         భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డి.ఎస్. నకార గారి కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి.చంద్ర చూడు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మా సనం 17-12-1982 న ఇచ్చిన తీర్పు ప్రకారం *పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే బిక్ష కాదు “పెన్షన్- ఉద్యోగుల హక్కు”అని ఇచ్చిన తీర్పు ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన రిటైర్మెంట్ ప్రభుత్వము చెల్లించడం లేదని కొంతమంది పెన్షనర్లు బకాయిలన్నింటిని ఏక మొత్తములో చెల్లించాలని గౌరవ హైకోర్టును సంప్రదించగా గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించినప్పటికీ కొంతమందికి చెల్లించి అందరికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం కోర్టు ధిక్కరణ అవుతుంది. హైకోర్టు జడ్జిగారు జూన్ 10, జూన్ 15 లోపు చెల్లించాలని ఆదేశించారు. కాబట్టి కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వేసిన ప్రతి ఒక్కరికి ఏక మొత్తంలో అన్ని బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా కోర్టుకు రాని వారికి కూడా చెల్లించాలని బాధిత పెన్షనర్ల సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.  అదేవిధంగా మీరు మే రెండవ తేదీన  టీజీఇజెఎసి వారికి ఇచ్చిన 4 హామీలను వెంటనే అమలు పరచాల్సిందిగా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధిత సంఘ రాష్ట్ర నాయకుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
      ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు! మా పెన్షనర్ల పట్ల మానవత్వం ప్రదర్శించి 18000 మంది పెన్షనర్ల  ప్రాణాలను కాపాడాలని, మాకు రావలసినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలన్నింటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే ఏక మొత్తంలో చెల్లించారో ఆ విధంగా ఏక మొత్తంలో చెల్లించి, పెన్షనర్  కుటుంబాలలో వెలుగులు నింపాలని  ఆశతో ఎదురు చూస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *