విద్యార్థులు, నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్న స‌ర్కార్‌

– బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను, హైడ్రా పేరుతో నిరుపేదలపై జరుగుతున్న అరాచకాలను తీవ్రంగా నిరసించారు. నాలుగేళ్లుగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన సుమారు రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు సాక్షిగా ఈనెల 15లోపు చెల్లిస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, బకాయిలు రాక విద్యార్థులు సర్టిఫికెట్లు లేక, ఉద్యోగాలు వచ్చినా చేరలేక యువత తీవ్ర మనోవేదనకు గురవుతున్నదని తెలిపారు. మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి పథకాన్ని మెరుగ్గా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి నెలా రూ.200 కోట్లు ఇస్తామన్న హామీని కూడా గాలికి వదిలేశారని విమర్శించారు. నిరుద్యోగ యువతను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని అంజిరెడ్డి మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పేరుతో కాలయాపన చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తు రుసుమును రూ.200 నుండి రూ.1000కి పెంచి నిరుద్యోగులపై ప్రభుత్వం అదనపు భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.1000 కోట్లు, నియోజకవర్గానికి ఒక తెలంగాణ స్టడీ సర్కిల్, ‘రాజీవ్ యువ వికాసం’ వంటి హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని, విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. మరోవైపు ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కూల్చివేతల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడం అత్యంత అన్యాయమని అన్నారు. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలకు బిజెపి వ్యతిరేకమని, అయితే అనుమతులు ఇచ్చిన ఎమ్మార్వోలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. చెరువుల శిఖం భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే వారికి ప్రత్యామ్నాయ భూమి లేదా పరిహారం ఇవ్వాలని, లేదా ప్రజలు భయం లేకుండా ఇళ్లు కట్టుకోవడానికి ‘హైడ్రా’ ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు. లేనిపక్షంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *