భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం

– ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం
– సర్వే పర్యవేక్షణకు 7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం
– రీ-సర్వేలో నాణ్యత, పారదర్శకత, వేగం అత్యంత కీలకం
– ఉన్నతస్ధాయి సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర రీ-సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వే పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అధికారులతో భూ సర్వే పురోగతిపై సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో వేగం, నాణ్యతతోపాటు ప్రతి దశలో నిరంతర పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సుమారు 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు లభించిన ఈ అవకాశాన్ని అధికారులు అత్యంత బాధ్యతతో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రీ-సర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు ఏడు జోన్లకు ఒక్కో జోన్‌కు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. సర్వే తీరును, నాణ్యతను, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తొలి దశలో 365 నక్షా లేని గ్రామాల్లో అలాగే జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2,240 మొత్తం 2768 గ్రామాల్లో రీసర్వే ముమ్మరంగా సాగుతుందని, ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. మొదటి దశ సర్వేను నవంబర్ ఆఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో లైసెన్స్‌డ్ సర్వేయర్, జీపీవో, డిప్యూటీ తహసీల్దార్ లేదా ఆరఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర సిబ్బంది ఉంటారని వివరించారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి రోజూ తహసీల్దార్ పర్యటించి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ రోజు ఎక్కడ సర్వే జరిగింది.. ఎన్ని ఎకరాలు/సర్వే నంబర్లు పూర్తయ్యాయి.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది.. ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశాలపై అధికారులు స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ-సర్వే జరగాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు

రీ-సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్ వంటి వివరాలన్నీ అందులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. సర్వేకు అవసరమైన సర్వేయర్లు, రోవర్లు, సర్వర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, సామగ్రి కొనుగోలుకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. అదనపు రోవర్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రీ-సర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రీ-సర్వే పేరుతో ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి

సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎర్రవల్లిలో 385 ఎకరాలలో 45 ఎకరాలు తక్కువ ఉందని, సర్వే కోసం మరోసారి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు కొన్ని చేతులు మారాయని, వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు అమరవీరులను గుర్తించి న్యాయం చేస్తామన్నారు. ఎర్రవల్లిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.

జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త
– 500 చ.గ లోపు పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం

22-ఎ సమస్యలను పరిష్కారిస్తామని గత నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటుతో కలుపుకుంటే ఆరు ఉత్తర్వులు ఇచ్చామని, తాజాగా జీవో ఎంఎస్ నెం.59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నెంబర్లు 14, 22, 29, 41 అనుగుణంగా మెమో నెంబర్ 48030ను జారీ చేశామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో ఏమైనా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి రికార్డులు, లబ్దిదారుల అర్హత, క్రమబద్దీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గత ప్రభుత్వంలో 59 జీవోను అనుసరించి కొన్ని అక్రమాలు జరిగాయని తమ దృష్టికి రావడంతో జీవో అమలును నిలిపివేశామని, అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించిన కన్వేయన్స్ డీడ్స్ జారీ అయిన కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలన్నారు. శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కారణాలతో వాటిని పెండింగ్‌లో ఉంచారని, దీంతో చిన్నచిన్న ఇళ్ల స్థలాలు, ఆస్తులకు సంబంధించిన సమస్యలతో సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద అంశాల విషయంలో సంబంధిత కోర్టులు ఇచ్చే ఆదేశాలకు లోబడి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.

22-ఎ సమస్యలకు వరుస పరిష్కారాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22-ఎ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సహచర మంత్రులతో చర్చించి 22-ఎతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జీవో 118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశామన్నారు. 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచఎంసీ, హెచఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వడం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారం, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టాభూముల సమస్యకు పరిష్కారం, తాజాగా 59జీవో అమలు దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *