– రోజురోజుకూ సరికొత్త రికార్డు
– తాజాగా రూ.1.25 లక్షలకు చేరిక
హైదరాబాద్, అక్టోబర్ 8: కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే ఔరా అనుకున్న వాళ్లు తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అంతర్జాతీయంగానూ పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. బంగారం ఒక్కరోజే రూ.2,290 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,780 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,12,900 పలుకుతోంది. వెండి సైతం కిలో రూ.1.56 లక్షలు దాటింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు 4034 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 48.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పసిడి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులకుతోడు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ కూడా ఓ కారణంగా పేర్కొంటున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. దాదాపు రెండేళ్ల క్రితం ఔన్సు బంగారం ధర 2 వేల డాలర్ల దిగువనే ఉండేది. అలాంటిది ఈ ఒక్క క్యాలెండర్ సంవత్సరంలోనే దాదాపు 50 శాతం మేర పెరగడం గమనార్హం. దీంతో పసిడి కొనుగోళ్లకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. పండగ సీజన్‌లో వ్యాపారాలు తగ్గడంతో ఆభరణ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





