మంత్రుల మధ్య సమసిన వివాదం

– పీసీసీ అధ్యక్షుడి నివాసంలో ఆ ఇద్దరితో సమావేశం
– అడ్లూరిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు
– ఆయన నాకు సోదరుడి వంటివాడు
– మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో బుధవారం సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య వచ్చిన వివాదాన్ని పరిష్కరించి సయోధ్య కుదిర్చారు. అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పడంతో ఇరువురి మధ్య వివాదం ముగిసింది. దీనిపై పీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేశారన్న వ్యాఖ్యల పట్ల మరో మంత్రి లక్ష్మణ్‌ నొచ్చుకోవడంతో యావత్‌ సమాజం కొంత బాధపడిరదన్నారు. మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్యగా వెల్లడిరచారు. ఎవరు ఎక్కడ మాట్లాడినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సహచర మంత్రివర్గానికి కూడా విజ్ఞప్తి చేశారు. ఇతర ముఖ్య నేతలైన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి, సంపత్‌ కుమార్‌, అనిల్‌, వినయ్‌ కుమార్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మా మ‌ధ్య పొర‌పొచ్చాలు లేవుః పొన్నం

కాంగ్రెస్‌ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకు పార్టీ సంక్షేమం తప్ప మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తాను అనని మాట పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. తనకు కాంగ్రెస్‌ పార్టీ అలాంటి సంస్కృతి నేర్పలేదన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నాయకత్వంలో రాహుల్‌ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం చేస్తున్నామన్నారు. కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గం తామంతా కలిసి పెరిగాం.. ఆ అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తాను రెండు రోజులు స్థానికంగా లేకపోవడం వల్ల ఫోన్‌ ద్వారా వాస్తవం తెలియచేయాలని ప్రయత్నించాను.. కానీ వారు అందుబాటులోకి రాలేదు అని పేర్కొన్నారు. ఆయన తనకు సోదరుడి వంటివారని, పార్టీలో తమ మధ్య 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదేనని తెలిపారు. ఈ అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగుతాయని, ఎవరూ విడదీయరానిదని అన్నారు. మంచి మిత్రులమైన తమ మధ్య తగవు పెట్టి బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నించారని పొన్నం ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page