– అలసత్వం వీడి పనులు ముమ్మరం చేయండి
– గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం
-సీతారామ లిఫ్ట్ పై సమీక్షలో మంత్రి తుమ్మల
సత్తుపల్లి/ ఖమ్మం/ భద్రాచలం/దమ్మపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలానికి సత్తుపల్లి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గంలోని యతలకుంటలో ఉమ్మడి జిల్లా అధికారులతో కలిసి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు నుంచి యతలకుంట వరకు సాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జులు, రోడ్డు క్రాసింగ్స్, కాలువ పనుల అమలులో ఉన్న లోపాలు, సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేసి, ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు అలసత్వాన్ని విడిచిపెట్టి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా సుమారు 43 కిలోమీటర్ల పొడవున 1.46 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. మొత్తం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు. యతలకుంట టర్మినల్‌కు సంబంధించిన మొత్తం 1.78 కిలోమీటర్ల పనుల్లో చివరి 30 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరిలో వరదలు వచ్చేలోపు టర్మినల్ ఎగువ భాగంలోని స్ట్రక్చర్ నంబర్లు 5 నుంచి 10 వరకు ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మే నెలాఖరులోగా అసంపూర్తిగా ఉన్న అన్ని స్ట్రక్చర్ల పనులను పూర్తి చేయాలని, వర్షాకాలానికి ముందే టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రక్చర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.భూసేకరణకు అవసరమైన నిధులు పూర్తిగా మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కోర్టు కేసులు లేదా భూ సంబంధిత సమస్యల కారణంగా ఎక్కడైనా పనులు ఆలస్యమైతే వెంటనే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. చిన్నచిన్న భూ సమస్యల కారణంగా పనులు నిలిచిపోవడం సమంజసం కాదని, రైతులతో చర్చించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలను సమయానికి తెలియజేయకుండా పనులు నిలిపివేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూసేకరణలో కొన్ని సమస్యలు, అవసరమైన అనుమతులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ వాటిని త్వరితగతిన పరిష్కరించి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా మరో ఒక కిలోమీటర్ కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆయకట్టు ఖమ్మం జిల్లా పరిధిలో ఉండగా, నిర్మాణ పనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కొనసాగుతున్నందున ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అటవీ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఒక్క కిలోమీటర్ పనుల కోసం వేల కోట్ల వ్యయం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో చిన్న కారణాల వల్ల పనులు నిలిచిపోవడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే జిల్లా కలెక్టర్లు లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యతలకుంట టన్నెల్ నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్ణయం తీసుకుని కేవలం రెండు సంవత్సరాల్లో టన్నెల్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి రాత్రింబవళ్లు పని చేసి ఈ సీజన్‌లోనే నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాజీవ్ కాలువ స్టెబిలైజేషన్ ద్వారా ఇప్పటికే సుమారు 1.35 లక్షల ఎకరాలకు నీరు అందించామని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్ జలాలు అందకపోయినా వైరా ఆయకట్టు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలకు గోదావరి జలాలను మళ్లించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా వేంసూరు, దమ్మపేట మండలాలకు కూడా నీరు అందించే అవకాశముందని అన్నారు .నాలుగో పంప్ హౌస్ పనులు పూర్తి అయితే వచ్చే సంవత్సరం అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు అందించవచ్చని తెలిపారు. దీంతో మొత్తం 110 కిలోమీటర్ల మేర కాలువ వ్యవస్థ పూర్తవుతుందని, మెయిన్ కాలువతో పాటు మూడు పంప్ హౌస్‌లను వినియోగించి గోదావరి జలాలను ఉభయ జిల్లాల్లోని 8 నియోజకవర్గాలకు సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు.పాలేరు ప్రాంతానికి గోదావరి జలాలు చేరాలంటే జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉభయ జిల్లాల్లోని మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీరు అందించడమే కాకుండా మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేసి పినపాక నియోజకవర్గంలో 16,500 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తేనే ప్రాజెక్ట్‌ను నిర్దేశిత కాలంలో పూర్తి చేసి ఉభయ జిల్లాలను సస్యశ్యామలంగా మార్చగలమని మంత్రి తుమ్మల తెలిపారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు,ఉభయ జిల్లాల ఇంజనీరింగ్ ,ఇరిగేషన్, పోలీస్, ఫారెస్ట్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





