భూగర్భ జలాలు పెంపొందించ‌డ‌మే లక్ష్యం

– జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జూలై 28 : వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ములుగు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంతోపాటు జలసిరి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ‘ఇంటింటికీ ఇంకుడు గుంత- ఊరి కోసం ఊటకుంట-పంట కోసం పంట కుంట’ అనే నినాదంతో ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా విస్తృతంగా పనులు చేపట్టాలని సూచించారు. జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మన ఇంటి సిరిగా భావించి భాగస్వాములు కావాలని కోరారు. పంచాయతీ, మహిళా సంఘాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతుల పొలాల్లో వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధి పనులు, పశువుల పాకలు, మిల్క్ షెడ్లు, పంట కుంటల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు, మహిళా రైతులు ‘జలసిరి’లో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి నీటిని వినియోగించకుండా అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే నష్టాలను నివారించవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జలసిరి పనులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క జలసిరి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తొలుత మల్లంపల్లి మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం.సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైైర్మన్ రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కొమురయ్య, ఎంపీడీవో సందీప్, రహీం వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *