గ్లోబల్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డీజీపీ

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌నుంచి
డి.జి.పి. భ‌ద్ర‌తా ఏర్పాట్ల  ప‌ర్య‌వేక్ష‌ణ‌

రంగారెడ్డి జిల్లాలోని మీర్ ఖాన్ పేట ప్రాంతంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం కార్యక్రమాలు జరుగుతున్న మీర్ ఖాన్ పేటలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు . కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ తో కలిసి డిజిపి సందర్శించారు. సమ్మిట్ వేదికతో పాటు పరిసర ప్రాంతాల్లో అమలు జరుగుతున్న పకడ్బందీ బందోబస్తు తీరును క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా, సమ్మిట్ జరుగుతున్న ప్రాంతంలో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణలను సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఈ బందోబస్తు విధుల్లో దాదాపు 6,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొనగా, వారి పనితీరును, వారికి అప్పగించిన విధులను డిజిపి అడిగి తెలుసుకున్నారు. ప్రతి అధికారి, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. బందోబస్తు కోసం కేటాయించిన పోలీసు అధికారుల విధులను గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఈ కీలకమైన భద్రతా విధుల్లో, ఇటీవల గ్రూప్-1 ద్వారా డీఎస్పీలుగా ఎంపికైన 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. వీరిలో 30 మందిని దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ ప్రతినిధుల కోసం లైజాన్ ఆఫీసర్లుగా కేటాయించారు, మిగిలిన వారిని గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో వివిధ కీలక పోస్టింగ్‌లలో నియమించారు. ఈ యువ డీఎస్పీలు దేశ విదేశాల నుండి వచ్చే ప్రముఖులకు లైజాన్ ఆఫీసర్లుగా వ్యవహరించడం విశేషం. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్రానికి ఇటీవలే కేటాయించబడిన నలుగురు కొత్త ఐపిఎస్ అధికారులకు కూడా ఈ బందోబస్తులో కీలక విధులను కేటాయించడం జరిగింది. ఈ భద్రతా ఏర్పాట్లలో ముగ్గురు అడిషనల్ డిజిపిలు, ఐదుగురు ఐజిపిలు పది మంది ఐపిఎస్ అధికారులు ఉన్నత స్థాయి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. వీరందరూ గ్రూప్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో విధులను నిర్వహిస్తూ, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page