మృతురాలు వీరనారి చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో సొంత కూతురే తల్లిని హత్య చేయించింది. పదో తరగతి చదువుతున్న బాలిక.. తన ప్రేమికుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చింది. మృతురాలు అంజలి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమాయణం సాగించిన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గత రాత్రి ప్రియుడు, అతని తమ్ముడితో కలిసి బాలిక తన ఇంటికి వచ్చింది. నిద్రిస్తున్న తల్లి అంజమ్మ గొంతు నులిమి కర్రతో తలపై కొట్టి చంపినట్టు సమాచారం. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. కాగా, మిగతా ఇద్దరు నిందితులు కూడా మైనర్లేనని తెలుస్తోంది.