ఉగ్రవాదుల ప్రవేశంపై కూపీ
న్యూదిల్లీ, జూన్ 24: పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై తాజాగా దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది. బాట్కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్‌లను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిదరూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు ఒప్పకున్నారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు హిల్ పార్క్‌లోని ఒక గుడిసెలో ఉన్నట్లు, వీరికి స్థానికులైన పర్వైజ్, బషీర్ ఆహారం, ఇతర వసతులు కల్పించినట్లు తేలింది. అంతేకాక ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసినట్లుగా కూడా గుర్తించారు. ఇక ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని అబోటాబాద్ నుంచి ముజఫరాబాద్ విూదుగా పూంజ్-రాజౌరికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దు కారిడార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక నిఘా వర్గాల దర్యాప్తు మేరకు ముగ్గురు ఉగ్రవాదులు అధునాతన పోరాట పటిమలు కలిగిన వారిగా తేల్చారు. రహస్య కదలికలు, మనుగడ వ్యూహాలు కలిగి ఉన్నట్లు తేలింది. పహల్గామ్‌కు ముందు జమ్మూకాశ్మీర్‌లోని స్పిన్నర్ ప్రాంతంలో జరిగిన దాడులతోపాటు పలు దాడుల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఉగ్రవాదుల కదలికల గురించి డిజిటల్ పాదముద్రలు, కమ్యూనికేషన్ మార్గాలను దర్యాప్తు సంస్థ విశ్లేషిస్తోంది. ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపయోగించడం వల్ల ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ప్రధానంగా స్థానికుల మద్దతుతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం స్థానికులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 26మందిని పొట్టన పెట్టుకున్న విషయం విదితమే.