మినీ సంగ్రామానికి సన్నద్ధం

– ఎమ్మెల్సీ ఎన్నికలు శాసనసభ ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్ అవుతాయా ?
– భూ రాజకీయం మధ్య ఎమ్మెల్సీ పోరు
– గెలుపు ఎవరిది? పట్టభద్రుల తీర్పు
– 2028 ఎన్నికలకు అగ్నిపరీక్ష!

                                                                        (మండువ రవీందర్‌రావు, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండేళ్ళకు జరగనున్న శాసనసభ ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్‌గా మారే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ పరిస్థితులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయమున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు రేపోమాపో జరగనున్నాయా అన్నంతగా పార్టీల మధ్య‌ మాటల యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్‌ ఇం‌తవరకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌పైన తీవ్ర విమర్శలకే పరిమితమైనదల్లా ఇటీవల కాలంలో ప్రత్యక్ష చర్యలు చేపడుతోంది. ఏకంగా  పార్టీ ముఖ్య నేతల ఫామ్‌హౌస్‌ల సర్వేలను చేపట్టడం పెద్ద దుమారాన్నే లేపుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలన్నీ భూమి చుట్టే పరిభ్ర‌మిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కారు చౌకగా అమ్ముకోవడం లేదా తమ సన్నిహితులకు కేటాయించడం చేస్తున్నదంటూ ప్రధాన బీఆర్‌ఎస్‌ ‌చాలాకాలంగా ఆరోపిస్తున్నది. దానికి ప్రతిగా గత పాలకులే భూ ఆక్రమణదారులంటూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కారు పార్టీ ముఖ్య నేతల ఫామ్‌హౌస్‌ల సర్వేను ప్రారంభించింది. ఇది ఇరు పార్టీల మధ్య‌ ఒక విధంగా యుద్ధ వాతావర్ణాన్ని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ రెండు కూడా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలు కావడం, ఇందులో పాల్గొనే వోటర్లంతా విద్యావంతులు కావడమే కాక ఆరు జిల్లాల పరిధిలో ఈ రెండు స్థానాలు ఉండడంతో వీరు ఇచ్చే తీర్పు రెండేళ్ళలో రానున్న శాసనసభ ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చిలో ఎన్నికలు జరగనున్న ఈ రెండు స్థానాలను తామే గెలుచుకుంటామన్న ధీమాను అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు స్థానాలను గతంలో ఒకటి బీఆర్‌ఎస్‌ ‌మరొటి కాంగ్రెస్‌ ‌గెలుచుకున్నాయి. హైదరాబాద్‌-‌రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ‌గ్రాడ్యుయేట్‌ ‌స్థానానికి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా సురభి వాణి ప్రాతినిధ్యం వహిస్తుండగా వరంగల్‌-‌ఖమ్మం-నల్లగొండ స్థానంలో కాంగ్రెస్‌ ఎంఎల్సీగా తీన్మార్‌ ‌మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం ముగుస్తుండడంతో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ‌తేదీలను ప్రకటించింది. అందుకు కావాల్సిన వోటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియకు సంబందించిన ప్రకటన కూడా వెలువడింది. సెప్టెంబర్‌ 28‌నుంచి ఫారం 18 దరఖాస్తుల స్వీకరణ‌ ప్రారంభించి నవంబర్‌ 6‌వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈలోగా పాత, కొత్త వోటర్లను సాధ్యమైనంత ఎక్కువగా జాబితాలో చేర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్దంచేసుకుంటున్నాయి. నవంబర్‌ 25‌న వోటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం డిసెంబర్‌ 30 ‌తుది జాబితాను వెల్లడించనున్నారు. రాష్ట్రంలోని పట్టభద్రుల్లో ఎక్కువ శాతం ఈ రెండు శాసన మండలి నియోజకవర్గాల్లో ఉన్నారు. దాంతో ఈ రెండు స్థానాలపైన అన్ని పార్టీలు ఇప్పుడు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. ఈ రెండు స్థానాలపై ప్రజలిచ్చే తీర్పు  2028 ఎన్నికలపై పడే ప్రభావముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గాల పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సుమారు 14 లక్షలకు పైగా ఉన్న పట్టభద్రుల తీర్పు కీలకం కానుంది. అందుకే రాజకీయ పార్టీలు వోటర్లను చేర్పించడం దగ్గరినుంచి అభ్యర్ధుల ఎంపిక కసరత్తును మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ ‌దీన్ని ప్రతిష్టగా తీసుకుంటున్నది. గతంలో తాము గెలుచుకున్న స్థానంతోపాటు మరో స్థానంలోకూడా పట్టు సాధించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అధికారంలో ఉండి రెండు స్థానాలను గెలుకోని పక్షంలో విపక్షాల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి కాంగ్రెస్‌ ‌పార్టీలో ఆశావహుల చిట్టాకూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి 20మందికి పైగా ఆశావహులు ఇప్పటికే తమ గాడ్‌ ‌ఫాదర్స్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిలో అచ్చ, పచ్చ కాంగ్రెస్‌ ‌నాయకులేకాక జర్నలిస్టులు కూడా ఉన్నారు.

ఖాళీ కాబోతున్న మ‌రో మూడు స్థానాలు

కాగా,  గవర్నర్‌ ‌కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా త్వరలో ఖాళీ కాబోతున్నాయి. వాస్తవంగా వాటిల్లో బస్వరాజు సారయ్య, దయానంద్‌లు బీఆర్‌ఎస్‌ ‌నుంచి ఎంపికైన వారే. కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన వీరు మరోసారి ఎమ్మెల్సీలు కావాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో సంచలనాత్మంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్‌ ‌తెలిసిందే. కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న కొండా సురేఖకు దిల్లీ అధిష్టానవర్గం అభయహస్తం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రిగా ఆమెను తీసివేసినా ఆమెకు ఎదైనా కార్పొరేషన్‌ ‌ చైర్మన్‌గా ఇచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్నది. అలాగే వారి డిమాండ్‌లో భాగంగా కొండా మురళికి గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించే విషయంపై ప్రచారం జరుగుతున్నది. ఈసారి జనసేనకూడా ఈ ఎన్నికల్లో భాగం కాబోతున్నది. అన్ని పార్టీలకన్నా ముందే వరంగల్‌ ‌పట్టభద్రుల స్థానానికి ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన గడల శ్రీనివాసరావును ప్రకటించింది. ఈ విషయంలో బీజేపీ కూడా పట్టుదలగానే ఉంది. ఆ పార్టీనుండి ఆశావహుల జాబితాకూడా పెద్దగానే ఉంది. బీఆర్‌ఎస్‌లో మాత్రం ఇంకా స్పందన కనిపించడంలేదు. ఎవరికివారు తమ ప్రయత్నంలో ఉన్నప్పటికీ అధినాయకుడి అభిప్రాయం ఎలా ఉందనేది బయటపడటంలేదు. మొత్తంమీద ఈ ఎన్నికలు ఒక విధంగా మినీ సంగ్రామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *