- తెలంగాణలో అదానీకి ఇంచు భూమి ఇవ్వలేదు
- అదానీ నేరం రుజువైతే ఒప్పందాలను రద్దు చేసుకుంటాం
- కెటిఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపాటు
హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్22: దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదానీ అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ప్రధాని మోదీపైనా నిప్పులు చెరిగారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ నుంచి తెలంగాణ సర్కార్ రూ.100 కోట్లు తీసుకోవడం తప్పు కాదా అని కేటీఆర్ ప్రశ్నించడంపై మహేశ్ గౌడ్ స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి కేటీఆర్ విరాళం ఇచ్చినా తీసుకుంటామంటూ ఆయన చురకలు అంటించారు. అదానీ కుంభకోణాన్ని అమెరికా అధికారులు బట్టబయలు చేసినందున వెంటనే అతన్ని అరెస్టు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. అదానీ దాదాపు రూ.2వేల కోట్ల మేర లంచాలు పంచారు. ఆయన అవినీతిపై రాహుల్‌గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు. అర్హత లేకపోయినా అదానీకి రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చారు. ప్రధాని మోదీ అండతో అనేక విమానాశ్రయ కాంట్రాక్టులు చేజిక్కించుకుని అవినీతి సామ్రాజ్యం స్థాపించారని అన్నారు.
శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానీపై వొచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేఏసీ) ఏర్పాటు చేయాలని కోరారు. 2014 తర్వాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశాం. రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైళ్లో వేశారు. రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలేవని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. అదానీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇంచు భూమిఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. నేరం రుజువైతే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
అదానీ అరెస్టయితే ప్రధాని మోదీ రాజీనామా తప్పదని టీపీసీసీ చీఫ్ జోస్యం చెప్పారు. అదానీ ఆర్థిక నేరంలో మోదీకీ భాగస్వామ్యం ఉందంటూ మహేశ్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని, లంచం అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ అరెస్టయితే అనేక అంశాలు బయటకి వొస్తాయని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వంలో ఆయన వేల కోట్ల లబ్ది పొందారని, అదానీ ఆగడాలపై రాహుల్ ఎన్నిసార్లు ప్రశ్నించినా మోదీ కనీసం స్పందించలేదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. అర్హత లేకున్నా అదానీ రుణాలు పొందారని, ఆయన వల్ల ప్రజలపై పెను భారం పడిందని ఆగ్రహించారు. అనేక దేశాలనూ అదానీ మోసం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.