రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ,ప్రజాతంత్ర,నవంబర్22: కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించు కోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, గ్రాణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సాధించవొచ్చని తెలిపారు.
కేంద్ర పథకాల అమలుకు సంబంధించి తన ఎంపీ అనుభవాలను సభ్యులతో పంచుకుంటూ, వాటిని ఎఫెక్టివ్‌గా అమలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర గ్రాణాభివృద్ధి శాఖ ప్రతీ జిల్లాలో దిశ కమిటీలను ఏర్పాటు చేసి, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు అవసరమైన సమన్వయం అందిస్తోందని మంత్రి తెలిపారు. తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి నల్లగొండ జిల్లాలో అమలవుతున్న పథకాలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలు నాయక్, వేముల వీరేశం, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.