మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో 2వ అంతస్తులోని తన చాంబర్‌లో మంత్రిగా శనివారం ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 844 మంది దివ్యాంగులకు రూ.5 కోట్లతో స్వయం ఉపాధి కల్పించే యూనిట్ల మంజూరు, అదేవిధంగా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా 2367 మందికి 3.50 కోట్లను పంపిణీ చేసే ఫైలుపై సంతకం చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఏటా 210 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యాసానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను 500 లకు పెంచారు. అందుకు సంబంధించిన ఫైలుపై కూడా మంత్రి సంతకం చేశారు. అదేవిధంగా మేడారం జాతరలో ఏర్పాట్లకు సంబంధించిన రూ.45 కోట్ల పనులకు, రూ.79.61 కోట్లతో గిరిజన విద్యాలయాల మరమ్మతు పనులకు, మినీ గురుకులాల నిర్వహణకు 17.18 కోట్లను, అదేవిధంగా ఐఐటీ, నీట్‌లో ర్యాంకులను సాధించిన 100 మంది గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు ఆమోదం తెలిపారు. అనుమతులు మంజూరు చేశారు. బాధ్యతలను స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, సంజయ్‌కుమార్, ధర్మపురి నియోజకవర్గ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.
ReplyForward
|