వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి

– ప్రతీ శాఖ సమన్వయంతో పనిచేయాలి
– జిల్లా, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ ఏర్పాటుకు చర్యలు
– గోదావరి పుష్కరాలకు సుందరంగా తీర్చిదిద్దాలీ
– జిల్లా అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్ 27 : గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లాను సుందరంగా తీర్చిదిద్దాలని, గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా అధికార యంత్రాంగంతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ అధికారులకT సూచించారు. భద్రాచలంలో వర్షపు నీరు వేగంగా నదిలోకి వెళ్లేలా పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందంటూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. గిరిజన రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని, ఎరువులు, ముఖ్యంగా యూరియా వినియోగంపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా జాతీయ రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటాలని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు, పుష్కరాల ఏర్పాట్లు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి భద్రాచలం-కూనవరం రహదారిపై చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మూడేళ్లుగా పనులు పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో సారపాక జాతీయ రహదారిపై గోదావరి వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఎత్తును పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదలకు ముందు, వరదల సమయంలో, అనంతరం చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర సన్నద్ధతతో ఉండాలని, వర్షపాతం, వరద పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బూర్గంపాడు, అశ్వాపురం ప్రాంతాలు అధికంగా వరదలకు ప్రభావితమవుతాయని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల సన్నద్ధతలో పరిశ్రమల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.

జిల్లా, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు

వరదల సన్నద్ధతలో భాగంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంత్రికి వివరించారు. జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుతోపాటు ఈ ఏడాది నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో మండల ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో వరదల సమయంలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసీ రెవెన్యూ, ఎస్‌డీఆరఎఫ్, ఎన్‌డీఆరఎఫ్ తదితర శాఖలతో సమన్వయంగా సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, అటవీ, అగ్నిమాపక, ఎస్‌డీఆరఎఫ్, ఎన్‌డీఆరఎఫ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *